- ఎక్కడికక్కడ కరవే కార్యకర్తల అరెస్ట్
- ఎంఈఎస్ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి
- బెల్గాం జిల్లాలో నిషేధాజ్ఞలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాం జిల్లా యళ్లూరులో మహారాష్ట్ర శిలా ఫలకాలన్ని ఆవిష్కరించినందుకు మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్)ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక (కరవే) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన యళ్లూరు చలో ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. బెల్గాంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు కరవే కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బెల్గాంకు దారి తీసే మార్గాలన్నిటిలో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే నాకాబందీని నిర్వహించారు.
బెంగళూరు నుంచి నాలుగు వాహనాల్లో బెల్గాంకు బయలుదేరిన 45 మంది కరవే కార్యకర్తలను అర్ధరాత్రి సమయంలో రాణిబెన్నూరు వద్ద అరెస్టు చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరవే అధ్యక్షుడు నారాయణ గౌడను హుబ్లీ సమీపంలో పుణె-బెంగళూరు రహదారిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గౌడ మాట్లాడుతూ యళ్లూరులో కన్నడ పతాకాన్ని ఆవిష్కరించడానికి తమకు ఎవరి అనుమతీ అవసరం లేదని తెలిపారు.
కర్ణాటకలో ప్రజా ప్రభుత్వం ఉన్నదా లేక బ్రిటిషర్ల పాలన సాగుతోందా...అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. మరో వైపు హుబ్లీ సమీపంలోని పాలికొప్ప క్రాస్ వద్ద కరవే కార్యకర్తలు ఓ బస్సుపై రాళ్లు రువ్వారు. బెల్గాం తాలూకా కార్యాలయం ప్రాంగణంలో ఎంఈఎస్ ఎమ్మెల్యే కార్యాలయంపై ఐదుగురు కరవే కార్యకర్తలు దాడి చేశారు. కాగా జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున యళ్లూరు చలోకు అవకాశం ఇవ్వలేదని బెల్గాం ఎస్‌పీ డాక్టర్ చంద్ర గుప్త తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఆందోళనలు చేయడం సరికాదని హితవు పలికారు. స్థానిక ప్రజలు శాంతియుతంగా జీవించడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు.