integration of Maharashtra
-
యళ్లూరు చలో భగ్నం
ఎక్కడికక్కడ కరవే కార్యకర్తల అరెస్ట్ ఎంఈఎస్ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి బెల్గాం జిల్లాలో నిషేధాజ్ఞలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాం జిల్లా యళ్లూరులో మహారాష్ట్ర శిలా ఫలకాలన్ని ఆవిష్కరించినందుకు మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్)ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక (కరవే) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన యళ్లూరు చలో ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. బెల్గాంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు కరవే కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బెల్గాంకు దారి తీసే మార్గాలన్నిటిలో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే నాకాబందీని నిర్వహించారు. బెంగళూరు నుంచి నాలుగు వాహనాల్లో బెల్గాంకు బయలుదేరిన 45 మంది కరవే కార్యకర్తలను అర్ధరాత్రి సమయంలో రాణిబెన్నూరు వద్ద అరెస్టు చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరవే అధ్యక్షుడు నారాయణ గౌడను హుబ్లీ సమీపంలో పుణె-బెంగళూరు రహదారిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గౌడ మాట్లాడుతూ యళ్లూరులో కన్నడ పతాకాన్ని ఆవిష్కరించడానికి తమకు ఎవరి అనుమతీ అవసరం లేదని తెలిపారు. కర్ణాటకలో ప్రజా ప్రభుత్వం ఉన్నదా లేక బ్రిటిషర్ల పాలన సాగుతోందా...అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. మరో వైపు హుబ్లీ సమీపంలోని పాలికొప్ప క్రాస్ వద్ద కరవే కార్యకర్తలు ఓ బస్సుపై రాళ్లు రువ్వారు. బెల్గాం తాలూకా కార్యాలయం ప్రాంగణంలో ఎంఈఎస్ ఎమ్మెల్యే కార్యాలయంపై ఐదుగురు కరవే కార్యకర్తలు దాడి చేశారు. కాగా జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున యళ్లూరు చలోకు అవకాశం ఇవ్వలేదని బెల్గాం ఎస్పీ డాక్టర్ చంద్ర గుప్త తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఆందోళనలు చేయడం సరికాదని హితవు పలికారు. స్థానిక ప్రజలు శాంతియుతంగా జీవించడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. -
బెల్గాంలో ఉద్రిక్తత
సాక్షి, బెంగళూరు : బెల్గాం జిల్లా యళ్లూరులో శుక్రవారం ఉదయం తిరిగి ఉద్రిక్తత నెలకొంది. నామఫలకం ఏర్పాటు విషయమై గత నెల 27న యళ్లూరు వద్ద మహారాష్ట్రా ఏకీకరణ సమితి (ఎంఈఎస్) సభ్యులు గందరగోళం సృష్టించడంతో పోలీసులు నిషేదాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఈఎస్ చర్యలను నిరసిస్తూ కన్నడ చలువళి పార్టీ నాయకుడు వాటాల్ నాగరాజు సారథ్యంలో పలు కన్నడ సంఘాల ప్రతినిధులు బెల్గాం నుంచి ‘చలో యళ్లూరు’ కార్యక్రమాన్ని చేపట్టారు. వారు బెల్గాంలోకి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వాటళ్ నాగరాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యుడైన సంభాజీ పాటిల్ వల్లే బెల్గాంలో శాంతిభద్రతల సమస్యల తలెత్తుతోందన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేసి మహారాష్ట్రకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎంఈఎస్ కార్యకర్తల చర్యలను సమర్థిస్తూ శివసేన పార్టీ ఎమ్మెల్యేలైన దివాకర్రావ్, సంజిత్ నిబేకర్తోపాటు మరికొంత మంది యళ్లూరులో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం జరపడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారి చర్యలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. శివసేన ఎమ్మెల్యేలను, కార్యక్తలను అదుపులోకి తీసుకున్నారు. నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం దగ్గరల్లో ఉన్న కాలువలోకి వెళ్లడంతో ఇన్స్పెక్టర్ హరిశ్చంద స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంలోనే దివాకర్రావ్, సంజిత్ నిబేకర్లు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి కోల్హాపుర శివసేన అధ్యక్షుడు విజయ్దేవన్తోపాటు పలువురు మహారాష్ట్రకు చెందిన నాయకులను పోలీసులు విచారిస్తున్నారు.