నిర్లక్ష్యానికి గురవుతున్న ఉన్నత విద్యలో సమూల మార్పులు తేవాలని, వినూత్న రీతిలో పిల్లలతో మమేకమై ఉపాధ్యాయులు బోధించాలని గవర్నర్ సి. విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు.
ముంబై: నిర్లక్ష్యానికి గురవుతున్న ఉన్నత విద్యలో సమూల మార్పులు తేవాలని, వినూత్న రీతిలో పిల్లలతో మమేకమై ఉపాధ్యాయులు బోధించాలని గవర్నర్ సి. విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. ఇక్కడి కేసీసీ కళాశాల డైమండ్ జూబ్లీ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘గత రెండు దశాబ్దాలుగా మనం వాణిజ్య, వర్తక వ్యాపారాల్లో ప్రపంచీకరణ చూశాం. కాని, ఇప్పటి వరకు ప్రపంచీకరణ ఫలితాలను ఉన్నత విద్యలో చూడలేకపోయాం. ముఖ్యంగా పరిశోధనలు, బోధనా పద్ధతుల్లో ఎన్నో లోపాలున్నాయి’ అని విద్యాసాగర్ పేర్కొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా మహారాష్ట్రలోని విద్యా సంస్థలు పరిశోధనాత్మకంగా ఉండేలా బోధనా పద్ధతులు ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. పిల్లల్లో సామాజిక దృక్పథం ఏర్పడేలా ప్రోత్సహించి వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరా రు. కార్యక్రమంలో పాల్గొన్న బారిష్టర్ రాం జఠ్మలానీ, ప్రకాశ ఝా, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, సినీ ప్రముఖులు అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, బోమన్ ఇరానీ, విద్యా బాలన్ తదితరులకు విద్యాసాగర్ రావు జ్ఞాపికలు అందజేశారు.