మలుపు తిరిగిన కారు దగ్ధం కేసు
సాక్షి, చెన్నై: సాయం సంధ్య వేళ నగర రోడ్డుపై పరుగులు తీస్తున్న కారు దగ్ధం కావడం, అందులో ఉన్న ఓ మహిళ, రెండేళ్ల బిడ్డ తీవ్రంగా గాయపడిన వ్యవహారం మలుపు తిరిగింది. కట్టుకున్న వాడే నిప్పు పెట్టి కారు నుంచి దూకేసినట్లుగా పోలీసులకు వాంగ్ములం ఇచ్చి ఆ మహిళ మృత్యువు ఒడికి చేరింది. నందనం సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు...
తేనం పేట ఆలయమ్మన్ ఆల యం వీధికి చెందిన నాగరాజన్(33) భార్య ప్రేమ, పిల్లలు యశ్వంత్(4), నిషాంత్‌రాజ్(2)లతో కలిసి బంధువు కారులో ఆదివారం బయటకు వెళ్లారు. ఈ కారు హఠాత్తుగా నందనం సిగ్నల్ సమీపంలో మంటల్లో చిక్కుకుంది. పరుగులు తీస్తున్న కారులో మంటలు చెలరేగడంతో నాగరాజన్ అప్రమత్తం అయ్యాడు. కారును పక్కగా నిలిపి కిం దకు దూకేశాడు. అతి కష్టం మీద కారు లో ఉన్న పెద్దకుమారుడు యశ్వంత్‌ను బయటకు తీశాడు. ఆ పరిసర వాసులు వెంటనే స్పందించి మంటల్లో చిక్కకున్న ప్రేమ, నిషాంత్ రాజ్‌లను కాపాడే ప్రయత్నం చేశారు.
ఎట్టకేలకు నిషాంత్ రాజ్‌ను బయటకు లాగినా, ప్రేమ మాత్రం లోపలే చిక్కుకుంది. ఘటనపై సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రేమను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కారు ప్రమాద సంఘటనలు తరచుగా సంభవవిస్తుండడంతో.. ఈ ప్రమాదం అలాంటిదే అని సర్వత్రా భావించారు. అయితే, కొన ఊపిరితో ఉన్న ప్రేమ అతి కష్టం మీద పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో కేసు మలుపు తిరిగినట్టు అయింది. భర్తే నిప్పు పెట్టాడని ఆరోపిస్తూ ఆమె కన్నుమూసింది. దీంతో దంపతుల మధ్య సాగుతూ వచ్చిన వివాదం పోలీసుల విచారణలో బయట పడింది.
విడి విడిగా ఉంటూ:
తొమ్మిది సంవత్సరాల క్రితం నాగరాజన్, ప్రేమల మధ్య వివాహం జరిగింది. మూడు నాలుగేళ్లుగా వీరి మధ్య గొడవలు మరీ పెరిగి ఉన్నాయి. నాగరాజన్‌ను ఆయన కుటుంబానికి దూరంగా ప్రేమ ఉంచడం అసలు గొడవకు కారణంగా తేలి ఉన్నది. ఇటీవల నాగరాజన్ కుటుంబీకులు చెంగల్పట్టు సమీపంలో సొంతంగా ఇంటిని నిర్మించుకుని వెళ్లి పోయారు. కుటుంబంతో కలిసి ఉండేందుకు ప్రేమ ఇష్ట పడక పోవడంతో, నాగరాజన్ తల్లిదండ్రుల వద్దకు తరచూ వెళ్తూ వచ్చాడు. చివరకు గత కొంత కాలంగా నెలలో ఏదో ఒక రోజు మాత్రం తేనం పేటకు రావడం, పిల్లల్ని చూసి, వారికి కావాల్సినది కొనిచ్చి నాగరాజన్ వెళ్తూ వచ్చాడు. దీంతో దంపతుల మధ్య దూరం పెరిగింది. ఆదివారం తన బంధువు పెరుంగుడికి చెందిన గణేషన్ కారును తీసుకుని నాగరాజన్ తేనాంపేటకు వచ్చాడు. పిల్లలతో పాటుగా ప్రేమను తీసుకుని బయటకు వెళ్లారు.
తిరిగి తేనాంపేటకు వస్తున్న సమయంలో దంపతుల మధ్య గొడవ జరగడం, ఈ గొడవతో కారులో మంటలు చెలరేగడం గమనార్హం. నాగరాజన్ తనను హతమార్చేందుకు మంటలు సృష్టించాడని ప్రేమ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. దీంతో నాగరాజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యను కడతేర్చేందుకు పథకం రచించి, దానిని ప్రమాదంగా మార్చి తప్పించుకునేందుకు నాగరాజన్ యత్నించినా, అతడి పెద్దకుమారుడు యశ్వంత్ వాదన మరో రకంగా ఉండడం గమనార్హం. నాగరాజన్ బంధువు గణేషన్ పేర్కొంటూ, తాను యశ్వంత్ వద్ద ఆరా తీసిన మేరకు, ప్రేమ కారు ఎక్కే సమయంలో ఓ క్యాన్‌ను బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చినట్టు వివరించాడని తెలిపారు.
కారులో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో ప్రేమ ఆ బాటి ల్ మూత తీసి తన మీద పోసుకున్నట్టు, తర్వాత మంటలు వచ్చినట్టుగా యశ్వంత్ తన దృష్టికి తెచ్చాడని ఆయన పేర్కొనడం ఆలోచించదగ్గ విషయమే. అయితే ఈ దంపతుల మధ్య సాగిన వివాదంతో ప్రేమ మృత్యు ఒడిలోకి చేరగా, నాగరాజన్ కటకటాల మధ్యలో నెట్టబడ్డాడు. గాయాలతో రెండేళ్ల నిషాంత్ రాజ్ ఆసుపత్రిలో, తల్లిదండ్రులు తన పక్కనే లేక పోవడంతో యశ్వంత్ కన్నీరు మున్నీరవుతున్నాడు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటనతో ముక్కు పచ్చలారని వయసులో ఇద్దరు చిన్నారులు అటు తల్లి, ఇటు తండ్రి ప్రేమకు దూరంగా ఒంటరిగా మిగలాల్సి రావడం గమనార్హం.