
చెన్నై మోడల్ మిస్సింగ్ మిస్టరీ
చెన్నై: మోడల్, స్క్రీన్‌ప్లే రైటర్ గానమ్ నాయర్(28) మిస్సింగ్ మిస్టరీగా మారింది. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు టీవీ చానల్‌లో స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేస్తున్న ఆమె ఈ నెల 26న నుంచి కనిపించకుండా పోయింది. వీరుగంబక్కమ్‌లోని ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని, వెంటనే తిరిగి వచ్చేస్తానని బంధువులకు చెప్పి వెళ్లిన గానమ్ ఇప్పటివరకు ఆచూకీ లేదు. దీంతో ఆమె బంధువులు కేకే నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గానమ్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ అయినట్టు పోలీసులు తెలిపారు. వీరుగంబక్కమ్ నుంచి నన్‌గంబక్కమ్‌కు ఆమె వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నలుపు రంగు హోండా యాక్టివా(టీఎన్ 09 బీయూ 5199) వాహనంపై గానమ్ బయటకు వెళ్లిందని, ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నామరని, గానమ్ స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
కూతురు కనిపించకపోవడంతో ఢిల్లీలో ఉంటున్న గానమ్ తండ్రి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గానమ్ ఆచూకీ తెలిస్తే చెప్పాలని ఆయన అభ్యర్థిస్తున్నారు.