
అనురాధ, తులసీ, కోమలి (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం మంగళవారం నగరంలో కలకలం రేపింది. పైగా తాము చనిపోతామని, తమను వెతకొద్దంటూ తల్లికి మెసేజ్ పంపించడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనలోకి నెట్టింది. ద్వారకానగర్ బుదిల్‌పార్క్ సమీపంలో నివసిస్తున్న మింది అనురాధ (22), తులసీ(20), కోమలి(17) అక్కాచెల్లెళ్లు. వీరిలో తులసీ, కోమలి విశాఖలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు.
వీరంతా సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లారు. అదే సమయంలో తల్లి లక్ష్మి మొబైల్‌కు మెసేజ్ పంపారు. దీంతో తల్లిదండ్రులు అప్రమత్తమై ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అదృశ్యం కావడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే మంగళవారం మళ్లీ తల్లి మొబైల్‌కి తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని మెసేజ్ పెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు వారెందుకు అలా మెసేజ్ పెట్టారు.. చెన్నై ఎందుకు వెళ్లారో వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఆ వివరాలకోసం దర్యాప్తు చేస్తున్నారు.