
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని ద్వారకానగర్‌లో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆచూకీ తెలిసింది. తమను వెతకవద్దంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు ఈ నెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఉన్నతాధికారులు మూడు ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. అదృశ్యమైన తర్వాత రోజు ముగ్గురు యువతులు తాము చైన్నైలో ఉన్నట్లు తండ్రికి మెసేజ్ పంపారు. పోలీసులు రంగంలోకి దిగి, ఫోన్ లోకేషన్ ఆధారంగా వారు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, పట్టుకున్నారు. ద్వారకానగర్ బుదిల్‌పార్క్ సమీపంలో నివసిస్తున్న మింది అనూరాధ(22), తులసీ(20), కోమలి(17) సొంత అక్కాచెల్లెళ్లు. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
‘అమ్మా.. మేం చనిపోతున్నాం. మమ్మల్ని వెతకొద్దు’ అని తమ తల్లి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ పంపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మంగళవారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మళ్లీ తల్లి మొబైల్ ఫోన్‌కి తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని మెసేజ్ పెట్టారు. వారు చెన్నైకి ఎందుకు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు విశాఖపట్నం నుంచి చెన్నైకి ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఒకరోజు ఉండి, బెంగళూరుకు వెళ్లినట్లు తేల్చారు. వారిని బెంగళూరులో పట్టుకుని, విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. ఇష్టం లేని వివాహం చేస్తున్నారన్న కారణంతోనే అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. (‘మేం చనిపోతున్నాం.. మా కోసం వెతకద్దు’)
Comments
Please login to add a commentAdd a comment