సాక్షి, చెన్నై: లాక్ అమలు కఠినం కానుంది. ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కట్టడి లక్ష్యంగా నాలుగు జిల్లాలో అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్ మళ్లీ అమల్లోకి వచ్చింది. ఇక ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారి వాహనాలు సీజ్ చేయడమే కాదు, జరిమానాల్ని వడ్డించడమే కాదు, తీసుకెళ్లి శివార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్లలోకి నెట్టేందుకు తగ్గట్టుగా దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇక, గురువారం చెన్నై శివార్లలోని రహదారులన్నీ కిక్కిరిశాయి. నగరం ఖాళీ చేసి స్వస్థలాలకు పయనమైన వాళ్లు వేలల్లో ఉన్నారు.
చెన్నై కమిషనరేట్ పరిధి, పక్కనే ఉన్న మూడు జిల్లాల్లో కరోనా స్వైరవిహారంతో పాలకులు కలవరంలో పడ్డ విషయం తెలిసిందే. ఇక్కడ కరోనాపై సమర భేరి మోగించేందుకు మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో కూడిన వారియర్స్ రంగంలోకి దిగారు. ఈపరిస్థితుల్లో కేసుల కట్టడి లాక్ ద్వారానే సాధ్యమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నుంచి ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ ప్రకటనతో చెన్నై, శివార్లలో ఉండడం కన్నా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ గ్రామాలు, స్వస్థలాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి జనం వచ్చేశారు. చదవండి: వ్యాపారం గాడిలో పడింది
శివార్లు కిటకిట..
చెన్నై నుంచి ఇతర జిల్లాల వైపుగా వేలాది మంది కదలడంతో శివార్లలోని అన్ని మార్గాలు గురువారం కిట కిటలాడాయి. దక్షిణ తమిళానాడు వైపు సాగే బైపాస్, పెరుంగళత్తూరు, వండలూరు మార్గం కిక్కిరిసింది. చెంగల్పట్టు టోల్‌గేట్లో కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి. పోలీసులు తనిఖీలకు కూడా శ్రమ తప్పదన్నట్టుగా వాహనాలు చొచ్చుకొచ్చాయి. ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాల్లో దక్షిణ తమిళనాడు వైపు కదిలిన జనం ఎక్కువే. దీంతో ఆయా జిల్లాల సరిహద్దుల్లో చెన్నై వైపు నుంచి వచ్చే వారిని తనిఖీల అనంతరం క్వారంటైన్లకు తరలించే పనిలో పడ్డారు.
ఇక, కాంచీపురం జిల్లా వైపు, తిరువళ్లూరు జిల్లా వైపుగా, ఈసీఆర్, ఓఎంఆర్ మార్గాల వైపుగా వాహనాలు పరుగులు తీశాయి. కొందరు అయితే, ఇళ్లను ఖాళీ చేసి వెళ్లడం, బ్యాచిలర్స్ తమ తమ గదుల్ని ఖాళీ చేసి, టీవీలు, ఇతర సామన్లు బైక్‌పై పెట్టుకుని రయ్యి మంటూ దూసుకెళ్లారు. కొన్ని చోట్ల పోలీసులు తనఖీలు కఠినం చేసినా, వాహనాలు బారులు తీరడంతో చేతులెత్తేయక తప్పలేదు. అతి కష్టం మీద వాహనాలకు జరిమానాల వడ్డన విధించారు. ఇప్పటి వరకు ఈ జరిమానాల రూపంలో రూ. 13.5 కోట్లు వసూళ్లు చేసి ఉండడం గమనార్హం. ఆరు లక్షల మందికి పైగా కేసులు, ఐదు లక్షల వాహనాలను సీజ్ చేసి ఉన్నారు. కాగా ఇప్పటి వరకు పది లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్‌లు పొంది ఉండడం, మరో 25 లక్షల మంది ఈ పాస్‌ల కోసం దరఖాస్తులు చేసుకుని ఉండడం గమనించ దగ్గ విషయం.
రోడ్డెక్కితే సీజ్..
చెన్నై కమిషనరేట్ పరిధిలో నాలుగు వందలు, మిగిలిన మూడు జిల్లాల పరిధిలో మరో రెండు వందలు చొప్పున చెక్ పోస్టులు వెలిశాయి. ఇక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు. రోడ్డెక్కితే చాలు వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. ఈ పాస్‌లు కల్గిన వారిని మాత్రం పరిశీలించి అనుమతించాలని, ఇతర వాహనాలను సీజ్ చేయాల్సిందేని, వాహనదారులపై కేసులు, ఆయా ప్రాంతాల శివార్లలో ఏర్పాటుచేసిన క్వారంటైన్లకు తరలించేందుకు తగ్గ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇక, అంబులెన్స్ , వైద్య సేవలు పొందే వారి కోసం ప్రైవేటు, ట్యాక్సీ ఆటోకు అనుమతి కల్పించారు. విమాన, రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయితే, అందులో ప్రయాణించే వారి చేతిలో విమానం, రైలు టికెట్ తప్పనిసరి . లేదా క్వారంటైన్లోకి నెట్టడం ఖాయం. ప్రజలు తమ పరిసరాల్లోని 2 కిమీ దూరంలో ఉన్న దుకాణాల్లోకి వెళ్లి సామన్లు తెచ్చుకోవాలని, అది కూడా నడిచి వెళ్తే మంచిదని హెచ్చరించారు.
వాహనాల్లో వెళ్లి తమకు పట్టుబడితే సీజ్ చేయడం ఖాయం అని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, ఆన్‌లైన్ ఫుడ్ సరఫరా సంస్థలు సిబ్బంది తమ గుర్తింపు కార్డులు , ఆయా సంస్థల అనుమతి పత్రాలను తప్పనిసరిగా చేతిలో ఉంచుకోవాలని సూచించారు. నీళ్లు, పాలు, పెట్రోల్, గ్యాస్ సంస్థలు తమ తమ వాహనాల ముందు ఏ5 షీట్‌తో కూడిన అనుమతి పొందిన పేపర్‌ను తనిఖీ సిబ్బందికి కనిపించే విధంగా ఉంచాలని ఆదేశించారు. 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంక్‌లు పనిచేస్తాయి. చదవండి: లాక్‌డౌన్ ప్రకటనతో.. కిక్కు కోసం క్యూ
బ్యాంక్ సిబ్బంది తమ వాహనాల్లో తప్పనిసరిగా ఆయా ఉన్నతాధికారులు అనుమతితో కూడిన లెటర్ ప్యాడ్స్ ఉంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. 21,28 తేదీల్లో పాలు, నీళ్లు, వైద్య సేవల మినహా తక్కిన అన్ని సేవలు పూర్తిగా బంద్ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఎలాంటి అను మతి లేకుండా రోడ్డెక్కే వాహనాలు సీజ్ చేయాలని, ఒక ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వచ్చి కూరగాయలు , ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసే వారితో మరింత కఠినంగానే వ్యవహరించాలని ఆదేశించడం, నకిలీ పాస్‌లు కల్గిన వారిపై కేసులు నమోదు అంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన దృష్ట్యా, ఇక, కఠినంగానే దరువు మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మద్యం కోసం బారులు..
ఇప్పటికే చెన్నైలో మద్యం దుకాణాలు అన్నది తెరచుకోలేదు. అయితే, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో తెరిచారు. అది కూడా శుక్రవారం నుంచి మూసివేయనున్నారు. దీంతో చెన్నై శివార్లలోని ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్న టాస్మాక్ దుకాణాల వద్ద కిలోమీటర్ల కొద్ది మందు బాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల తోపులాటలు, ఘర్షణలు తప్పలేదు. సామాజిక బాధ్యతలు, భౌతిక దూరాల్ని మరిచి మద్యం కోసం ఎగబడ్డ బాబులు ఎక్కువే. దీంతో పోలీసులు లాఠీలు జుళిపించక తప్పలేదు.
నంబర్లు..
ఇక, 22 నుంచి 26వ తేదీ వరకు రేషన్ దుకాణాలను మూసి వేస్తూ, ఇంటింటా రూ. వెయ్యి నగదు పంపిణీ చేసే వారికి మాత్రం ప్రత్యేక అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, వృద్ధులు, వికలాంగులు, ఆదరణ లేని వాళ్లు, పేదలకు సేవ చేయదలచిన, స్వచ్ఛంద సంస్థలు అనుమతి తప్పనిసరిగా పొందాల్సిందేనని, అందరూ మాస్క్‌లు ధరించాల్సిందేని, ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాల్సిందేనని పిలుపునిస్తూ డీజీపీ త్రిపాఠి ఈ లాక్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఏదేని అనుమానాలు ఉంటే, ప్రత్యేక కంట్రోల్ రూమ్ 044–23452330, 044–23452362 లేదా 9003130103 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment