- చెవిరెడ్డి భాస్కరరెడ్డి
గుంటూరు: విచారణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం తమపై ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇప్పటికే 6, 7 తేదీల్లో భూమనను విచారించిన సీఐడీ.. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి భూమనను విచారిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా పలువురు నేతలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు సీఐడీ కార్యాలయ ప్రాంగణం వద్ద 144 సెక్షన్ విధించారు.