సీఐడీ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం
భూమన కరుణాకరరెడ్డిని విచారించే సందర్భంగా.. పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద.. సీఐడీ కార్యాలయానికి అవతలివైపు ఉన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. తాము ఆఫీసులోకి రాలేదని.. అలాంటప్పుడు ఎందుకు తమను వెళ్లిపొమ్మంటున్నారని అడిగినా వినిపించుకోలేదు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. ''మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, పాకిస్థాన్‌లో ఉన్నామో అర్థం కావట్లేదు. మేం రోడ్డుమీద ఉన్నాం. వెళ్లిపోవాలంటే కరుణాకర రెడ్డిని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఏం తప్పు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఒకటి స్పష్టంగా చెబుతున్నాం.. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదు.
చంద్రబాబు తానుచేసిన తప్పుల నుంచి తప్పించుకోడానికి మరో తప్పు చేస్తున్నారు. ఆరోజు జరిగిన విధ్వంసం ప్రభుత్వమే చేసి ఉంటుందని మాకు అనుమానం కలుగుతోంది. జగన్ సీబీఐ దర్యాప్తు కోరినా, ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రభుత్వం వెనక నుంచి నడిపించిందన్న విషయం బయటపడుతుందనే సీబీఐ విచారణకు అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో హింసాత్మక చర్యలు చేపట్టిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కరుణాకరరెడ్డికి ఏమైనా జరిగితే మాత్రం సహించేది లేదు. పోలీసు అనే పదానికి ఉన్న విలువను ఈ ప్రభుత్వం దిగజారుస్తోంది'' అని చెవిరెడ్డి అన్నారు.