భూమనను అరెస్టుచేస్తే తీవ్ర పరిణామాలు
వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. తుని ఘటనలో విచారణ పేరుతో ఆయనను గుంటూరుకు తీసుకొచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు చేస్తున్న హడావుడి చూస్తుంటే కరుణాకరరెడ్డిని అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అలా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలం కావడంతో పాటు ఓటుకు కోట్లు కేసు తదితర అంశాల్లో టీడీపీ సర్కారును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబెట్టనుందని, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలతో ప్రత్యేక హోదాను పక్కన పెట్టించి ప్యాకేజి కోసం మంత్రులతో బేరసారాలు ఆడిస్తున్నారని, రేపు హోదా కోసం ప్రజల్లో తిరుగుబాటు వస్తే, వైఎస్ఆర్‌సీపీ దానికి నాయకత్వం వహిస్తుందని తెలిసి, దాన్ని పక్కదోవ పట్టించడానికి వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
గుంటూరుకు హడావుడిగా అర్ధరాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారని, ఇదంతా చూస్తుంటే తమకు భూమనను అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై లోపలున్న పోలీసులను అడిగినా తమకు ఎలాంటి సమాచారం లేదని వాళ్లు చెబుతున్నారన్నారు. విచారణ తర్వాత కరుణాకరరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. భూమనను రహస్యంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు మాత్రం అరెస్టు చేస్తామని గానీ.. చేయబోమని గానీ ఏమీ చెప్పలేదని తెలిపారు. సాధారణంగా చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే సీఐడీ వాళ్లు అదే చేస్తారని.. వాళ్లు ఏం చెప్పారో చూడాలని అంబటి అన్నారు. కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారంటే చంద్రబాబు అలాగే ఆదేశించారేమో చూడాల్సి ఉందన్నారు.