ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు
తమను ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఖూనీ చేయడంతో తమ జాతి అవమానపడిందని, మోసానికి గురైందని, నష్టపోయిన తమ జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటానికి తాము మద్దతు ఇచ్చాం, ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుందని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబుకు, కాపులకుమధ్య సంబంధం పాము- కప్పలాంటిదని ఆయన ఎద్దేవా చేశారు.
తమను బెదిరించినా, ఎంత అప్రజాస్వామ్య పద్ధతులు పాటించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, తాను ఒత్తిళ్లు, భయాలకు లొంగే మనిషిని కానని.. తన జీవితంలో భయమంటే ఏంటో తెలియదని ఆయన కుండ బద్దలుకొట్టారు. కాపుల విషయంలో చంద్రబాబు రూథర్ ఫర్డ్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉందని.. అందుకే వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. రేపు ఉదయం మళ్లీ రమ్మని పిలిచారని, విచారణకు హాజరవుతానని భూమన తెలిపారు.