సాక్షి, బెంగళూరు: రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లల భవిష్యత్తును చిదిమేస్తోంది. గంటల కొద్దీ కంప్యూటర్‌ను వాడుతూ, వీడియో గేమ్స్ ఆడుకునే చిన్నారులు చదువులో వెనకబడి పోతున్నారు. కుటుంబ బంధాలకు దూరమవుతున్నారు. నగరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్(నిమ్హాన్స్) క్లినికల్ సైకాలజీ విభాగం చిన్నారుల్లో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పై సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో వెల్లడైన విషయాలు పరిశీలిస్తే సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతటి దుష్ర్పభావాలను చూపుతోందో అవగతమవుతుంది. నగరంలోని వివిధ పాఠశాలలు, పీయూసీ కళాశాలల నుంచి మొత్తం 200 మంది విద్యార్థులను ఎంపిక చేసి నిమ్హాన్స్ సర్వే నిర్వహించింది. ఈ 200 మందిలో 73.5శాతం మంది విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులోకి వచ్చిన వివిధ మాధ్యమాలకు బానిసలైనట్లు వెల్లడైంది.
19.5శాతం మంది వీడియోగేమ్స్, 15.5శాతం మంది మొబైల్ ఫోన్లు, 18శాతం మంది ఇంటర్నెట్ వినియోగానికి అలవాటు పడిపోయారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అలవాటు పడిన వారిలో 66శాతం మంది చదువులో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 64.5శాతం మంది క్రీడల్లో వెనకబడిపోతున్నారు. 61శాతం మంది విద్యార్థులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అలవాటు పడిన విద్యార్థుల్లో 13-15ఏళ్ల లోపు వారితో పోలిస్తే 16-17ఏళ్ల లోపు వారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ 200 మంది విద్యార్థుల్లో 46.5శాతం మంది విద్యార్థులు పూర్తిగా ఫేస్‌బుక్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ అంశంపై నిమ్హాన్స్ క్లినికల్ సైకాలజీ విభాగం అడిషనల్ డెరైక్టర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ....‘ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చిన్నారుల్లో ఎక్కువవుతోంది.
ఇంటర్నెట్, వీడియో గేమ్స్, మొబైల్‌ఫోన్స్ వీటి వాడకానికి అలవాటు పడిన చిన్నారులు ఆ తర్వాత వాటికి బానిసలైపోతున్నారు. తద్వారా చదువుల్లో, క్రీడల్లో ఇలా అన్ని అంశాల్లో వెనకబడిపోతున్న విషయాన్ని మేం ఈ సర్వే ద్వారా తెలుసుకున్నాం. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ ద్వారా చిన్నారులను ఈ అలవాటు నుండి తప్పించవచ్చు’ అని తెలిపారు.
పిల్లల భవితపై టెక్నాలజీ దెబ్బ
Published Fri, Jul 1 2016 3:55 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM
Advertisement