
విజయ ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలకు అమ్మ సన్నద్ధం అవుతోంది. అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ఆదేశించారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఉత్తర్వులు అందాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 15తో ముగుస్తుంది. ఈలోగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. 2011 ఏప్రిల్ 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, మే 15వ తేదీన జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలను విధిగా నిర్వహించాల్సి ఉంది. మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇందుకు సమాయుత్తం అవుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే పార్టీలు అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తటస్థంగా వ్యవహరిస్తోంది. అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తున్న పార్టీలు ఎన్నికల సమయానికి ఏఏ గూటికి చేరుతాయి, ఎవరితో కూటమిగా మారుతాయనే అంశం తేలేందుకు మరికొంత సమయం వేచి చూస్తేగానే స్పష్టతరాదు. ద్రవిడ పార్టీలతో పొత్తుపెట్టుకోబోమని పీఎంకే ఇప్పటికే ప్రకటించింది. డీఎంకే ఎన్నికలకు సమాయుత్తం అవుతున్న తరుణంలో మద్య నిషేధ ఉద్యమం సాగుతున్నందున అన్నిపార్టీల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.
అన్నాడీఎంకే ముందడుగు: సంపూర్ణ మద్యనిషేధం పోరులో ప్రతిపక్షాలన్నీ తలమునకలై ఉన్నందున ఇదే అదనుగా అన్నాడీఎంకే జయ ప్రచార వ్యూహం పన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. సదరు నేత తనకు అప్పగించిన పోలింగ్ బూత్ పరిధిలో ప్రతి ఇంటి తలుపుతట్టి అన్నాడీఎంకే ప్రభుత్వ సాధనపై ముద్రించిన కరపత్రాలను పంచుతూ ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈలెక్కన రాష్ట్రంలో 5.5 కోట్ల ఓటర్లను పార్టీనేతలు వ్యక్తిగ తంగా కలుసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలతో కూడిన సర్క్యులర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆదివారం విడుదల చేశారు.
తన నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం మాత్రమే ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిందని జయ అన్నారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజల నుండి ప్రభుత్వానికి భరోసా లభించడం ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్రంలోని 64,094 పోలింగ్ బూత్‌ల పరిధిలో 5,62,06,547 మంది ఓటర్లను పార్టీనేతలు కలుసుకుంటారని ఆమె తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై అభిప్రాయసేకరణ చేస్తారని చెప్పారు. దీని ద్వారా చారిత్రాత్మకమైన పురోగతి ప్రజల వల్ల తేటతెల్లం కాగలదని ఆమె అన్నారు. అన్నాడీఎంకే తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, ఓటర్లు సహకరించాలని జయలలిత విజ్ఞప్తి చేశారు.