సాక్షి, ముంబై: మరికొన్ని రోజుల్లో పట్టాలు ఎక్కబోయే మెట్రో రైలులో ప్రయాణించేవారి కోసం స్మార్ట్‌కార్డు, టోకెన్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను అమర్చనున్నారు. దీంతో స్మార్ట్ కార్డు, టోకెన్ కలిగిన ప్రయాణికులు ఈ ద్వారాల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ ద్వారాల వద్ద ప్యానెల్‌లను అమర్చడంతో ఇవి ప్రయాణికుడి వద్ద ఉన్న కార్డులను రీడ్ చేస్తాయని, తర్వాత ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయని అన్నారు. దీంతో ప్రయాణికుడు లోపలికి వెళ్లే వీలుంటుందని తెలిపారు.
గమ్యస్థానం చేరుకున్నా ప్రయాణికుడు ఎంత దూరం వరకు ప్రయాణించాడో నిష్ర్కమణ ద్వారం వద్ద ఉన్న ప్యానెల్ గుర్తించి ఆ మేరకు చార్జీని కార్డు నుంచి తీసుకుంటుందన్నారు. నిష్ర్కమణ ద్వారం వద్ద అమర్చిన స్లాట్‌లో టోకెన్ ఇన్సర్ట్ చేయడంవల్ల ఈ ద్వారం తెరుచుకుంటుందన్నారు. దీంతో టోకెన్ కలిగినవారు ఇక్కడి నుంచి నిష్ర్కమించే వీలుంటుందని చెప్పారు. ‘ఈ కార్డులో రూ. 10,000 వరకు బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ప్రయాణికుడు ఈ కార్డును కోల్పోతే ఎవ్వరూ దుర్వినియోగం చేసే వీలులేకుండా దీనిని బ్లాక్ చేయడానికి వీలుంటుంది. కొత్తది పొందిన తర్వాత పాత కార్డు ద్వారా కోల్పోయిన బ్యాలెన్స్‌ను తిరిగి పొందే వెసులుబాటు ఉంద’ని పేర్కొన్నారు. ఈ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, ఫొటో, గుర్తింపు నంబర్‌లు పొందుపర్చబడి ఉంటాయన్నారు.
ఐదు లక్షల కాంట్రాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డులు (సీఎస్‌సీ), నాలుగు లక్షల కాంట్రాక్ట్‌లెస్ స్మార్ట్ టోకెన్(ఎస్‌టీ)లను జారీ చేస్తామని తెలిపారు. నాన్ పర్సనలైజ్డ్ స్మార్ట్ కార్డులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అయితే ఈ కార్డులను బ్లాక్ చేయడానికి, మళ్లీ దానిస్థానంలో కొత్తది తీసుకోవడానికి వీలుండదని తెలిపారు. ఈ కార్డు కరెన్సీ నోట్ మాదిరిగా ఉంటుందన్నారు. దీనిని ఎవ్వరైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శనం చేసిన వివరాల ప్రకారం.. సీఎస్‌సీ కార్డులో రూ.10,000 బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి.
అయితే ఈ కార్డును ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్‌సీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న రవాణా సేవలలో కూడా ఉపయోగించుకునే వీలుంటుందన్నారు. ఏఎఫ్‌సీ ద్వారాలు సదరు వ్యక్తి వద్ద ఉన్న కార్డులో ఉన్న సమాచారాన్ని రీడ్ చేసి ప్రయాణికుడిని లోపలికి అనుమతిస్తాయని తెలిపారు. నిమిషానికి 45 మంది ప్రయాణికులను అనుమతిచ్చే సామర్థ్యం ఉందన్నారు. ప్రీ పేయిడ్ కార్డులైన సీఎస్‌సీ, సీఎస్‌టీ అందుబాటులోకి రావడంతో టికెట్ విండో వద్ద ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. చిల్లర విషయంలో సిబ్బందికి, ప్రయాణికుల మధ్య వాగ్వాదం ఉండదని వెల్లడించారు.