ముంబై: వడగండ్ల వాన అసెంబ్లీని బుధవారం తాకింది. అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు. శివసేన, బీజేపీ నాయకులు వెల్‌లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో నాసిక్, ధులే, జల్గావ్, పుణే, అహ్మద్‌నగర్, భండారా, నాగపూర్, అమరావతి, యావత్మల్‌లో భారీ వర్షం, వడగండ్ల వాన వల్ల ఉల్లిగడ్డ, పత్తి, చెరకు, అరటి పండ్ల తోటలకు నష్టం కలిగిందన్నారు. వారిని వెంటనే ఆదుకునేందుకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది.
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు కోల్పోయిన రైతులను త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీని ఇచ్చారు. వడగండ్ల వాన కురిసేందుకు కారణం భూతాపమేనా అనేది తెలుసుకునేందుకు భారత వాతావరణ శాఖ అధికారులను సంప్రదిస్తున్నామని ఆయన వివరించారు. 13 జిల్లాలోని 94 తాలూకాల్లో 1,36,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందన్నారు. వీటిలో నాగపూర్, యావత్మల్, అమరావతి, వార్ధా, నాందేడ్, ధులేలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్ర విపత్తు పునరావాస నిధి కొత్త మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహరం అందిస్తామని తెలిపారు.
పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చాక కేబినెట్ సమావేశంలో చర్చించి అదనపు సహాయంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లా సహకార బ్యాంక్‌లు క్రియారహితంగా ఉండటంతో బ్యాంక్‌ల ద్వారా రైతులకు ఎలా సహాయం చేయాలన్న దానిపై కూడా దృష్టి కేంద్రీకరించామన్నారు. పంట నష్టాలపై ఆయా జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. వడగండ్ల వర్షం కురిసిన పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో గురువారం మంత్రులు పర్యటిస్తారని తెలిపారు. వాతావరణం అంతా అనుకూలించి పంట చేతికందింది అని అనుకున్న దశలో వడగండ్ల వాన మళ్లీ రైతులని శోకసంద్రంలోకి నెట్టిందని అన్నారు.
శాంతి భద్రతలో సర్కార్ విఫలం: ఖడ్సే
ముంబై: రాష్ర్టంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్ పదవికి సత్యపాల్ సింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరతారని తెలియని పాటిల్ ఇక ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అంచనా వేయడంలో ఎలా వ్యవహరిస్తారోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతో జరగుతున్న బదిలీలు, పదోన్నతుల వల్ల పోలీసు శాఖలో అసంతృప్తి నెలకొందని ఆయన వివరించారు.
త్వరలోనే ఇద్దరు అదనపు డీజీ ర్యాంక్ పోలీసు అధికారులు పదవికి రాజీనామా చేస్తారన్నారు. విజయ్ కాంబ్లీ, అహ్మద్ జావదేలను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించడం వెనుక కులం, ప్రాంతం ఉన్నాయని విమర్శించారు. సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేసిన నేరస్తులను ఇప్పటివరకు పట్టుకోలేకపోయారని విమర్శించారు. మహిళలపై నేరాలు, నక్సల్స్ ఆగడాలు పెరగడంపై ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీకి ‘అకాల’ దెబ్బ
Published Wed, Feb 26 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement