= భూ సేకరణ పూర్తయిన వెంటనే గిణిగెర-మహబూబ్‌నగర్ రైలు మార్గం నిర్మాణ పనులు
= రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు 12500 ఎకరాల భూమి అవసరం
= రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గె
రాయచూరు, న్యూస్‌లైన్ : ప్రాధాన్యతక్రమంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రైల్వే మంత్రిత్వశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్గంలో రాయచూరు-గద్వాల, రాయచూరు-కాచిగూడ రైలు సర్వీసులను శనివారం ఆయన రాయచూరు రైల్వే స్టేషన్‌లో ప్రారంభించి మాట్లాడారు. వివిధ దశలలో ఉన్న రైల్వే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. రాయచూరు రైల్వే స్టేషన్‌లో రూ. కోటితో ఎక్స్‌వేటర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైలు మార్గం అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. గిణిగెర- మహబూబ్‌నగర్ రైలు మార్గానికి 2190 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 1070 ఎకరాలు సేకరించామన్నారు. మిగతా భూ సేకరణ పూర్తయిన వెంటనే రైలు మార్గం పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోని మంత్రి వర్గం హామీ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
చిక్కమగళూరు- కడూరు, బీదర్- హుమ్నాబాద్ రైల్వే మార్గాల్లో సర్వే నిర్వహించి రెండు నెలల్లో రైల్వే సంచారం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని నీటి పారుదల పథకాలకు కేంద్రం రూ.5,500 కోట్లు మంజూరు చేసిందన్నారు. అప్పర్ కృష్ణ పథకం పూర్తి చేయడం రికార్డుగా చెప్పవచ్చన్నారు. 2016 నాటికి మూడున్నర లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కలుగుతుందన్నారు. రాయచూరుకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైల్వే శాఖలో సీ, డీ గ్రూప్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించి 53 రోజుల నిర్ధిష్ట దినాలను 58 రోజులకు పెంచే తీర్మానం చేశామన్నారు. దీని వల్ల రూ.వెయ్యి కోట్ల ఆర్థిక భారం రైల్వే శాఖపై పడనుందన్నారు.
ఆర్టికల్-371(జే) అమలుతో హై-క అభివృద్ధి
హై-క అభివృద్ధికి సంబంధించిన ఆర్టికల్-371(జే) సవరణకు రాష్ట్రపతి నుంచి వారం రోజుల్లో గ్రీన్ సిగ్నల్ రానుందన్నారు. దీంతో ఆరు జిల్లాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. ఈ మండలికి గవర్నర్ అధ్యక్షుడిగా ఉన్నందున అభివృద్ధికి, నిధులకు ఎలాంటి లోటు రాదన్నారు. హై-క అభివృద్ధి మండలి ప్రధాన కార్యాలయం గుల్బర్గాలో ఏర్పాటు కావడం వల్ల ఇతర జిల్లాల వారు అనుమాన పడాల్సింది ఏమి లేదన్నారు.
లాభాల బాటలో రైల్వే
అనేక సవాళ్ల మధ్య కూడా రైల్వే శాఖ 3 శాతం లాభాలు ఆర్జించిందని మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. భారీ వర్షాలు, సమైక్యాంధ్ర వల్ల కొంత మేర నష్టం కలిగిందన్నారు. సమయపాలన, ప్రజా అవసరాల మేర మార్గాలను రూపొందించడం వల్ల నష్టాలను తగ్గించుకున్నామన్నారు. దేశంలో 16 జోన్లలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలుతీసుకుంటున్నామన్నారు. రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు 12500 ఎకరాల భూమి అవసరం ఉండగా 2000 ఎకరాల భూమి మాత్రమే లభ్యమైందన్నారు. మిగిలిన భూస్వాధీనానికి చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారి ఏకే.మిత్తల్ తెలి పారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్‌వీ.దేశ్‌పాండే, మహదేవప్ప, శరణప్రకాష్ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బోసురాజ్, పాపారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు హంపనగౌడ, హంపయ్య నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్, జయణ్ణ పాల్గొన్నారు.