ఐదేళ్లలో రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి
కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే
రాయచూరు, న్యూస్‌లైన్ : పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. శనివారం ఆయన రాయచూరు సమీపంలోని మటమారి రైల్వేస్టేషన్‌లో మటమారి-మంత్రాలయం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ (జంట మార్గం) పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా 587 రైల్వే ప్రాజెక్ట్‌ల పూర్తికి రూ.4.50 లక్షల కోట్లు ఆవసరమవుతాయన్నారు. అనంతరం ఆయన రూ.65 కోట్ల వ్యయంతో తుంగభద్ర నదిపై రైల్వే వంతెన పునరుదరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రాయచూరులో ముఖ్యమైన ఈ రైల్వే బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో రైల్వే పనుల జాప్యానికి బాధ్యులైన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.
మటమారి-మంత్రాలయం మధ్య 10 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు 18 నెలల్లో పూర్తి అవుతాయన్నారు. సభలో మాట్లాడిన రాయచూరు రూరల్ ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్... మంత్రి మల్లికార్జున ఖర్గేను హైదరాబాద్-కర్ణాటక అంబేద్కర్‌గా అభివర్ణించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, ఎంపీ పక్కీరప్ప, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.