సీఎం అభ్యర్థి ఎంపికపై అయోమయం
Published Fri, Oct 18 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వివాదం బీజేపీకి ముచ్చెమటలు పుట్టిస్తోంది. హర్షవర్దన్‌ను ఎంపిక చేస్తారంటూ వచ్చిన వార్తలతో అప్రమత్తమైన గోయల్ మద్దతుదారులు పార్టీ కార్యాలయం ఎదుట గురువారం బలప్రదర్శనకు దిగారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీ ప్రకటించారు. అభ్యర్థి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేయడం వల్ల పార్టీ ఘోరంగా నష్టపోతుందని, కాంగ్రెస్, ఆప్‌లు లాభపడుతాయని కార్యకర్తలు అంటున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పేరును ఖరారు చేయడం ఢిల్లీ బీజేపీకి కత్తిమీద సాములా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తాజాగా వచ్చిన ఊహాగానాలతో సీనియర్ నాయకుడు విజయ్ గోయల్ తిరుగుబాటు చేయడం అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ విషయంలో గోయల్, ఆయన మద్దతుదారుల ఒత్తిడి దృష్ట్యా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో నాన్చు డు ధోరణిని వీడాలని కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టంభన తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందనే కలవరమూ వారిలో మొదలయింది. 2008లో అంతర్గత విబేధాలే పార్టీని అధికారానికి దూరం చేశాయని, ఈ ముసలమే ఈసారి కూడా ముప్పు తెస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్దన్‌ని ప్రకటించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు మంగళవారం ఊపందుకోవడంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు గోయల్ వర్గం అప్రమత్తమయింది.
అభ్యర్థి రేసులో తానే ముందున్నానని, ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా ఉంద ని గోయల్ బుధవారం ప్రకటించారు. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ గోయ ల్ మద్దతుదారులు ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీ కార్యాలయం ఎదుట గురువారం బలప్రదర్శనకు దిగారు. హర్షవర్దన్ పేరును తాము అంగీకరించబోమని స్పష్టీకరించారు. దీనికితోడు 1998నాటి పొరపాటును పునరావృతం చేయరాదని గోయల్ హెచ్చరించడం వంటి పరిణామాలు బీజేపీ అధిష్టానానికి చిరాకు కలిగిస్తున్నా యి. ఎన్నికలు సమీపిస్తుండగా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే వ్యూహాలు, ప్రచారంపై దృష్టి సారించకుండా తమ నేతలు స్వప్రయోజనాల గురించి పాకులాడడంపై కార్యకర్తలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా మూడుసార్లు అధికారాన్ని దక్కించుకుని, నాలుగోసారి కూడా తమ ప్రభుత్వమే ఏర్పడుతుం దన్న ధీమాతో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు అవినీతి, కరెంటు, నీటి చార్జీల పెంపు, ధరల పెరుగుదల వంటి సమస్యలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆమ్‌ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ‘ఈ రెండు పార్టీలు ఓట్లపై దృష్టి సారిస్తుండగా, మా నేతలు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. సరైన నాయకత్వం లేమివల్లే బీజేపీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలకు చూపించకలేకపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుని ముందుకు దూసుకుపోతోంది. ఢిల్లీ బీజేపీలో ఐక్య త లేదన్న విషయం గోయల్ తిరుగుబాటు మరోసారి నిరూపించింది’ అని బీజేపీ నాయకుడు ఒకరు అన్నారు.
మొదటి నుంచీ అసమ్మతే..
నిజానికి గోయల్‌ను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఆయన ఒంటెత్తు పోకడలు సహించలేని పలువురు సీనియర్ నేతలు గోయల్‌ను పదవి నుంచి తొలగించాలని అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. తనను షీలాదీక్షిత్ ప్రత్యర్థిగా చూపుకోవడానికి గోయల్ చేస్తున్న ప్రయత్నాలు వారికి రుచించడం లేదు. గోయల్‌కు బదు లు వివాదరహితుడైన హర్షవర్దన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. హర్షవర్దన్ అభ్యర్థిత్వాన్ని సుష్మాస్వరాజ్, అద్వానీ, నరేం ద్రమోడీ, అనంత్‌కుమార్ వంటి సీనియర్లు కూడా బలపరుస్తున్నారని అంటున్నారు.
మచ్చచలేని వ్యక్తిగా ముద్రపడినవారినే ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కూడా భావి స్తోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే గోయల్ పార్టీ విజ యావకాశాలను దెబ్బతీయవచ్చన్న భయం అధిష్టానానికి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించే విషయంలో నాన్చుడు ధోరణి అనుసరించాలని భావిస్తోంది. నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీకి అప్పగించారని తెలిసింది.
అయితే వారు ఈ విషయంపై ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్లమెంటరీ బోర్డు త్వరగా సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చాలని కార్యకర్తలు కోరుతున్నారు. అయితే పార్లమెంటరీ బోర్డు సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని, ఆదివారం సమావేశం కావచ్చని సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.
గోయల్ మద్దతుదారుల బలప్రదర్శన
ముఖ్యమంత్రి అభ్యర్థిగా గోయల్ పేరును ప్రకటించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ బీజేపీ కార్యాలయం ఎదుట గుమిగూడిన గోయల్ మద్దతుదారులు గోయల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్దతుదారులతోపాటు విజయ్‌గోయల్‌ను ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీ లోపలికి పిలిచించి మాట్లాడారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని గడ్కరీ వారికి చెప్పారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని నితిన్ గడ్కరీ తెలిపారు.
1998లో చేసిన పొరపాటును పార్టీ తిరిగిచేయరాదని ఈ సందర్భంగా గోయల్ అన్నారు. గోయల్ గురువారం టీవీ చానెల్‌తో మాట్లాడుతూ బలప్రదర్శన చేయవలసిన అవసరం తనకు లేదని, గత ఎనిమిది నెలలుగా తాను చేసిన పని పార్టీ నేతలకు కని పిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తానొక్కడినే లేనన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అభ్యర్థి విషయమై పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభన వల్ల పార్టీకి నష్టమేమీ ఉండబోదన్నారు. ఇది లా ఉంటే కృష్ణాగనర్ నియోజకవర్గంలో గురువారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన హర్షవర్దన్ ఈ వివాదంపై మాట్లాడడానికి నిరాకరించారు.
Advertisement