సీఎం అభ్యర్థిపై అధిష్టానానికి గోయల్ విజ్ఞప్తి
Published Tue, Oct 22 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్దన్‌ను ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో తిరుగుబాటు ధోరణి కనబర్చిన విజయ్‌గోయల్ హఠాత్తుగా చల్లబడ్డారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేనని, సదరు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ప్రకటించారు. అయితే హర్షవర్ధన్ అభ్యర్థిత్వంపై సంపూర్ణ వ్యతిరేకతను కనబరస్తున్న గోయల్ ఈ విషయమై పార్టీ అగ్రనేతలను కూడా కలిసినట్లు సమాచారం.
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వివాదంతో సంక్షోభంలో చిక్కుకున్న ఢిల్లీ బీజేపీ నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో సఫలీకృతం కానట్లే కనిపిస్తోంది. ఆదివారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ పేరు ముఖ్యమంత్రి పదవికి ఖరారైనట్లు తెలుసుకున్న గోయల్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘హర్షవర్ధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే పార్టీ అధ్యక్షుడిగా ఇదే అంకిత భావంతో పనిచేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘అటువంటి నిర్ణయమే తీసుకుంటే నేను సంతోషించను’ అని బాహాటంగానే తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తానే ముందున్నానని తొలుత ప్రకటించి వివాదాన్ని సృష్టించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేనని, సదరు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ప్రకటించారు.
ముఖ్యమంత్రి పదవికి అర్హులైన నలుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ పరిశీలిస్తోందన్నారు. వర్ధన్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నాడన్న విషయాన్ని కూడా గోయల్ అంగీకరించలేదు. డాక్టర్ హర్షవర్దన్‌ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రటిస్తే తాను అధ్యక్ష పదవిని వీడుతానంటూ వచ్చిన వార్తలనూ ఆయన ఖండించారు. ఆదివారం నాటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయానన్న వార్తల్లోనూ వాస్తవం లేదని, తాను ఆ కమిటీలో సభ్యుడిని కానందునే అక్కడి నుంచి యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లానని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆమె కోటరీ ఈ పుకార్లను వ్యాపింపజేస్తోందని గోయల్ ఆరోపించారు. ఇదిలాఉండగా కానీ పార్టీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్, నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్‌లను కలిసి వర్ధన్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన పది సర్వేల్లో ముఖ్యమంత్రి పదవికి తానే అర్హుడనని మెజార్టీ ప్రజలుఅభిప్రాయపడిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఏదో ఉంది...
అయితే గోయల్ ఇచ్చిన ఈ వివరణ విలేకరులను సంతృప్తి పరచలేకపోయింది. ఆయన ఎప్పటి మాదిరిగా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలోగాక ఈ సమావేశాన్ని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించడంపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. బీజేపీలో సమస్య ఏమీ లేదని గోయల్ అంటున్నా సంక్షోభం కొనసాగుతోందన్న విషయాన్ని ఆయన మాటలు సూచించాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్దన్‌ను ప్రకటించాలని ఆదివారం సమావేశమైన పార్లమెంటరీ బోర్డు అభిప్రాయపడిందని, బోర్డు అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విదేశాల నుంచి ఢిల్లీకి వ చ్చిన తరువాత ఈ ప్రకటన వెలువడుతుందని ఊహాగానాలు వినిపించాయి. పార్టీ కోసం గత ఎనిమిది నెలలుగా శ్రమించిన తనను కాదని హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడాన్ని సహించలేని గోయల్ రాజీనామాకు సిద్ధపడ్డట్టు పుకార్లు వచ్చాయి. ఈ కోపంతోనే ఆయన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారని భావించారు. గోయల్ అధ్యక్ష పదవిని వీడితే ఆయన స్థానంలో ఆర్తిమెహ్రా, విజయ్ జోలీ, విజేంద్ర గుప్తా పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. గోయల్ మాత్రం అధ్యక్ష పదవిని వీడబోవడం లేదని ఆదివారమే స్పష్టం చేశారు. అయితే సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గోయల్ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం సంచలనం సృష్టించింది. ఆయన తిరుగుబాటు ప్రకటించడం తథ్యమన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
అయితే గోయల్ మాత్రం ఎప్పటి మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో లేను. ఈ విషయంపై మా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. నేను పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడానికే ఆదివారం నేను బీజేపీ కార్యాలయానికి వెళ్లాను’ అని వివరణ ఇచ్చారు. హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత కూడా ఇప్పటి మాదిరిగానే దూకుడుగా పనిచేస్తారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. సమస్య ఏమీ లేదంటూ గోయల్ వాదించే ప్రయత్నం చేస్తున్నా ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని వదిలి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించడం గోయల్ ఆంతర్యాన్ని వెల్లడిస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే బహిరంగంగా తిరుగుబాటు చేయడంవల్ల కలిగే నష్టాన్ని గోయల్ గుర్తించారనే వాదనలూ వినిపిస్తున్నాయి. గతంలో పార్టీని ధిక్కరించిన వారందరికీ పట్టిన గతిని ఆయన గుర్తించే తిరుగుబాటు ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు.
Advertisement
Advertisement