సీఎంకు 15 ప్రశ్నలు సంధించిన గోయల్
Published Mon, Oct 14 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
సాక్షి, న్యూఢిల్లీ: 15 ఏళ్ల పాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పరిపాలన వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సీఎం షీలాదీక్షిత్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ సవాల్ విసిరారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి 15 ప్రశ్నలను ఆయన సంధించారు. ‘నేను అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు. అందుకే ఆమె తన ముగ్గురు మంత్రులతో తప్పుడు నివేదికలు విడుదల చేయిస్తున్నారు’అంటూ గోయల్ విరుచుకుపడ్డారు. ‘ఎలాంటి అవకతవకలు జరగకపోతే ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలి కదా’ అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి గోయల్ సంధించిన 15 ప్రశ్నలు ఇవే:
= నగరవాసుల ఆర్థిక జీవనంలో ఎంతో మార్పు వచ్చిందని షీలా సర్కార్ చెబుతోంది. అలాంటప్పుడు 1999-2000 మధ్య 3.6 శాతంగా ఉన్న నగరంలో నిరుద్యోగుల సంఖ్య ఇప్పుడు నాలుగు శాతానికి ఎలా పెరిగింది?
= దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం నగరంలో ఉందని చెబుతున్నారు. మరి అటువంటపుడు నగరంలోని 72 శాతం మందికి ఆహార భద్రత కల్పించాల్సిన అవసరం ఏమిటి?
= ప్రైవేటు కంపెనీలకు విద్యుత్ సరఫరా ఇస్తే విద్యుత్ చార్జీలు తగ్గుతాయని నమ్మబలికారు. 15 ఏళ్ల పాలనలో 300 శాతం విద్యుత్ చార్జీల్లో పెరుగుదల ఎందుకు వచ్చింది.
= నగరంలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి కేటాయించిన నిధుల్లో 29 శాతం నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు.
= నగరంలోని ఆస్పత్రుల సంఖ్యతోపాటు వాటిలోని పడకల సంఖ్య గణనీయంగా పెంచామంటున్నారు. ఢిల్లీ హ్యూమన్ డెవలప్‌మెంట్ నివేదిక ఇందుకు భిన్నంగా ఎందుకు ఉంది.
= స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి కీ అత్యవసర పరిరకాల కొరత ఉన్నట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది.
= నగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించామని, ప్రపంచ స్థాయిలో రవాణా వ్యవస్థను రూపు దిద్దినట్టు చెబుతున్నా.. ఎన్నో ప్రాంతాల్లో రహదారుల దుస్థితిలో ఎటువంటి మార్పూ ఎందుకు లేదు.
= పర్యావరణ పరిరక్షణకు డీటీసీ బస్సుల్లో సీఎన్‌జీ వాడుతున్నట్టు అధికారికంగా పేర్కొంటున్నారు. ఆరువేల డీటీసీ బస్సుల్లో కేవలం రెండు వేల బస్సులు మాత్రమే సీఎన్‌జీతో నడుపుతున్నారు.
= తాగునీటి సరఫరాను మెరుగుపరిచినట్టు ప్రభుత్వం తన నివేదికల్లో పేర్కొంటోంది. కాగ్ పేర్కొన్న ప్రకారం 40 శాతం నగర వాసులకు జల్‌బోర్డు నీరు నేటికీ ఎందుకు అందుబాటులోకి రాలేదు?
= ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో రాణిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం. 80 ప్రభుత్వ పాఠశాలలను మూసివేడయంతోపాటు పాఠశాలల్లోని 12వేల మంది సిబ్బంది నియామకాలను ఎందుకు పెండింగ్‌లో ఉంచింది.
= అణగారిన వర్గాల వారి పిల్లల చదువుకు ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొంటున్నా వారికోసం కేటాయించిన 15 వేల సీట్లు ఖాళీగానే ఎందుకు ఉంచుతున్నారు.
= నగరంలోని ఐదు లక్షల మందికి లబ్ది చేకూర్చేందుకు ఉద్దేశించిన లాడ్‌లీ పథకం 42శాతం సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్నట్టు కాగ్ నివేదికలతో వెల్లడైంది.
= నగరంలోని మహిళలు, వృద్ధులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనడానికి ‘క్రైం క్యాపిటల్’అన్న పేరే నిదర్శనం.
= నగరంలో పర్యావరణం, పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. మరి గత పదేళ్ల కాలంలో కాలుష్యం 21శాతం పెరిగినట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన నివేదికల్లో ఎందుకు పేర్కొంది?
Advertisement