అంతర్గత కుమ్ములాటలతో కమలం డీలా
Published Sat, Oct 12 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాలు బీజేపీ ఉత్సాహాన్ని నీరుగార్చేశాయి. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కమిటీని ఆగస్టు 25వ తేదీనే ఎంతో ఉత్సాహంగా, ముందుగానే ప్రకటించిన ఆ పార్టీ.... అభ్యర్థుల ఎంపికకొచ్చేసరికి డీలాపడిపోయింది. ఇందుకు కారణం అంతర్గత కుమ్ములాటలేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అసంతృప్తికి లోనవుతారోననే ఆందోళన కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి సెప్టెం బర్ 15 నాటికి తొలి జాబితా, అదే నెల చివరినాటికల్లా రెండో జాబితా ప్రకటిస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ గతంలో ప్రకటించారు. అయితే ఎన్నికల కమిటీ ఏర్పాటై 50 రోజులు గడిచిపోయినా ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.
శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగేందుకు మొత్తం 1,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో సీనియర్ నేతల బంధువులు, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అసంతృప్తికి గురై తిరుగుబాటు జెండా ఎగురవేస్తారోననే ఆందోళన కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యానికి మరో కారణమైంది. విజయావకాశాలు ఉన్న సీట్ల కోసం ప్రముఖ నేతలు పోటీపడడం పార్టీ అధిష్టానానికి మింగుడుపడడం లేదు. ఉదాహరణకు గ్రేటర్ కైలాశ్ స్థానం కోసం విజయ్ మల్హోత్రాతో పాటు విజయ్ జోలీ పోటీ పడుతున్నారు. తనకు కాకుంటే కనీసం తన కుమారుడికైనా ఆ స్థానం ఇప్పించాలని విజయ్‌కుమార్ మల్హోత్రా పట్టుదలతో ఉన్నారు. విజయ్ జోలీ దీనిపై తన అభ్యంతరాన్ని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే షాలిమార్ బాగ్ టికెట్‌ను తనకు గానీ లేదా తన భార్య పల్లవి గోయల్‌కుగానీ ఇవ్వాలని విజయ్ గోయల్ కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ తనయుడు జగ్ ప్రవేశ్ కూడా ఈ సీటు నుంచి పోటీచేయాలనుకుంటున్నారు. నేతల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చినట్లయితే కార్యకర్తల్లో నిరాశానిస్పృహలు అలుముకునే ప్రమాదం ఉందంటున్నారు. ఇర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం కూడా అభ్యర్థుల ఎంపికలో నెల కొన్న అయోమయానికి మరింత ఊతమిచ్చేదిగా పరిణమించింది. శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు కోసం ఆగస్టు 25నే ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఏడుగురు ఆహ్వానితులతో 24 మంది సభ్యులతో ఎలక్షన్ కమిటీని, 54 మంది తో ఎలక్షన్ కోర్ గ్రూపును ఏర్పాటుచేసిన తరువాత సెప్టెంబర్ నెలాఖరునాటికల్లా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తామంటూ విజయ్ గోయల్ ఆర్భాటంగా ప్రకటించారు.
కానీ అనుకున్నట్లుగా సెప్టెంబర్ 15 న తొలిజాబితా వెలువడలేదు. సెప్టెంబర్ 29న నరేంద్ర మోడీ ర్యాలీ ఉన్నందువల్ల ఆ ఏర్పాట్లలో తలమునకలయ్యామని, ఆ ర్యాలీ తరువాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ ర్యాలీ జరిగి 10 రోజులు దాటిపోయినా అభ్యర్థుల జాబి తా ఇంకా వెలువడనేలేదు. ఈ వారంలో కూడా ఎన్నికల కమిటీ సమావేశం కాలేదు. అంతర్గత కలహాల కారణంగా అభ్యర్థుల జాబితాను ఇప్పట్లో విడుదల చేసే పరిస్థితి లేదని, ఈ నెలాఖరునాటికి లేదా వచ్చే నెల ఆరంభంలో అభ్యర్థుల జాబితా వెలువడొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తొందరపడొద్దు
మరోవైపు త్వరపడి అభ్యర్థుల జాబితాను ప్రకటిం చొద్దని, దీనిపై ఉత్కంఠను వీలైనంతకాలం పొడిగించమని ఆర్‌ఎస్‌ఎస్ ఢిల్లీ శాఖ బీజేపీకి సలహా ఇచ్చిం దని అంటున్నారు. ఈ పేర్లను ఇప్పుడే ప్రకటించినట్లయితే తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందువల్ల అఖరి నిమిషందాకా అభ్యర్థుల జాబితాను వెల్లడించకుండా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ సలహా ఇచ్చినట్లు సమాచారం.
Advertisement
Advertisement