బీజేపీ సీఎం అభ్యర్థిత్వంపై విజయ్ గోయల్
Published Thu, Oct 17 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
సాక్షి, న్యూఢిల్లీ : సీఎం అభ్యర్థికి తానే సరైన నాయకుడినని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పరోక్షంగా నొక్కిచెప్పారు. ఎన్నికల ప్రచారంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడినే సీఎం అభ్యర్థిగా అధిష్టానం ప్రకటిస్తుందనుకుంటున్నానని బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సీఎం అభ్యర్థిత్వం విషయానికి వస్తే పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించే వాడినే ప్రకటిస్తారని భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గోయల్ ఆ గౌరవం తనకే దక్కుతుందన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పటికే గోయల్‌పై సీనియర్ నాయకులు ఫిర్యాదులు చేయడంతో హర్షవర్ధన్ పాటిల్ పేరును అధిష్టానం సీఎం అభ్యర్థిత్వానికి పరిశీలిస్తుందన్న వార్తల నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ఇప్పటివరకు తాము నిర్వహించిన ప్రచారాలు, ర్యాలీలను మీరు చూశారు. అన్నింట్లో విజయవంతమయ్యామని, సమర్థంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామ’ని గోయల్ చెప్పుకొచ్చారు. పార్టీ సీఎం అభ్యర్థిత్వాన్ని వివాదం చేసి తనకున్న క్లీన్ ఇమేజ్‌ను చెడగొట్టొద్దని విలేకరులను వేడుకున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఇప్పటివరకు తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. తన క్లీన్ ఇమేజ్‌ను చెడగొట్టొద్దని విలేకరులపై రుసరుసలాడారు. ప్రజల తో సత్సంబంధాలు కలిగిన నేతను తానని, ఇప్పటికే వచ్చిన ఒపీనియన్ పోల్‌లను చూస్తే సీఎం పదవిలో చూడాలనుకుంటున్న ప్రజల్లో తానొక మంచి గుర్తింపు ఉన్న నేతనని తెలిపారు.
ఒపీనియన్ పోల్ చూస్తే తనకే ఛాన్స్
ఈ ముఖ్య అభ్యర్థిత్వం కోసం హర్షవర్ధన్ పేరును ప్రకటించేందుకు అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ సానుకూలంగానే ఉన్నారని పార్టీ వర్గాలు తెలి పాయి. అయితే ఈ పదవికి తానే సరైన వ్యక్తినంటూ గోయల్ ప్రకటన చేశారు. తనపై ఉన్న ప్రజాదరణ వివిధ ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైందన్నారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా సరైన వ్యక్తిని తానేనని తేలిందన్నారు. ‘మా పార్టీ ముందుంది. తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం రేసులో కూడా ముందున్నాన’ని తెలిపారు. పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టపరిచేలా పనిచేశానని చెప్పా రు. పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని బీజేపీ పార్లమెం టరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుదని తెలిపారు. అనేక సర్వేల్లో తానే ముందున్నానని తెలిపాయని చెప్పారు.
ఈ వివరాలను నితిన్ గడ్కారీకి పంపానని తెలిపారు. ఆ పదవికి పేరును ఖరారు చేసే వ్యక్తిపై తన సంతోషమనేది ఆధారపడి ఉంటుందని గోయ ల్ అన్నారు. ఒకవేళ వేరొక అభ్యర్థిని ఎంపిక చేస్తే మీరు ఇదే పద్ధతిలో పార్టీ కోసం పనిచేస్తారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, అయితే పార్టీ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, గడ్కారీ, ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌లను గోయల్ వేర్వేరుగా కలిశారు. 14 జిల్లాల పార్టీ అధ్యక్షులు గడ్కారీని కలిసి సీఎం అభ్యర్థిత్వానికి గోయల్ పేరును ప్రతిపాదించాలని కోరారు. ఒకవేళ గోయ ల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే పార్టీకి ఎంతమేర నష్టం కలిగిస్తాడో అని పార్టీ నాయక్తవం భయపడుతోందని స్థానిక బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోట్లల్లో బొక్కేశారు
పేదలకు అందాల్సిన కోట్ల రూపాయల రేషన్ సరుకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొట్టారని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ధ్వజమెత్తారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి భాగస్వామ్యం ఉందని ఆయన విరుచుకుపడ్డారు. పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం)స్కాంకి సంబంధించి ఇటీవల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో పలు వాస్తవాలు బయటికి వచ్చాయంటూ ఆయన ఓ నివేదిక విడుదల చేశారు. నకిలీ రేషన్ కార్డులను తయారు చేసిన ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల రూపాయల రేషన్ సరుకులను కాజేశారంటూ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ రేషన్‌కార్డులతో జమచేసిన ధాన్యాన్ని బయట ఫ్లోర్ మిల్లులకు విక్రయిస్తున్నట్టు ఆధారాలున్నాయన్నారు.
కొన్ని కార్డుల్లో వినియోగదారుల పూర్తి చిరునామా సైతం లేదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 1.68 కోట్లు ఉండగా కోటి 80 లక్షల మందికి రేషన్‌కార్డులు ఉన్నట్టు వెల్లడించిందన్నారు. 2011 ఎకానమిక్ సర్వే ఆఫ్ ఢిల్లీప్రకారం 33.4 లక్షల కుటుంబాలకు 32.26 లక్షల రేషన్‌కార్డులు మంజూరయ్యాయన్నారు. నివేదికల ప్రకారం పరిశీలిస్తే 2008 నుంచి నగర ప్రభుత్వం 1.7 లక్షల నకిలీ రేషన్‌కార్డులు మంజూరు చేసినట్టు తేటతెల్లమవుతుందన్నారు. నివేదికలు బయటపడడంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రేషన్‌కార్డులను తగ్గించడం ప్రారంభించిందని, దీనిలో నిజమై న లబ్ధిదారులు సైతం కార్డులు పోగొట్టుకున్నారని గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆహార, పౌర సరఫరాల విభాగానికి సంబంధించి కాగ్ వెల్లడించిన నివేదికల్లో 82వేల రేషన్‌కార్డులు అవసరానికి మించి ప్రింట్ చేసినట్టు పేర్కొందని గోయల్ చెప్పారు. దాదాపు 92వేల మంది లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద లేదని కాగ్ నివే దికల్లో వెల్లడైందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోనే ఇన్ని లోటుపాట్లు ఉన్నాయని, ఇక ఆహారభద్రత బిల్లు కింద పేదలకు ఏ విధంగా లబ్ధి చేకూరుంతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల విధానాలతో పేదల ఆహారానికి భద్రత లేకుండా పోతోందన్నారు.
Advertisement
Advertisement