సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండుగా ఏర్పడ్డ ఠాణే, పాల్ఘర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పట్టు సంపాదించాలనే లక్ష్యంతో పావులు కదుతుపుతోంది. ఈ నేపథ్యంలో నవీ ముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ల ఎన్నికల బాధ్యతలను ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
నవీముంబైపై నారాయణ రాణేకు, ఔరంగాబాద్‌పై అశోక్ చవాన్‌కు బాధ్యతలు అప్పగించారు. నవీముంబైలో మంచి పట్టున్న ఎన్సీపీ నాయకుడు గణేష్ నాయిక్ పార్టీ మారనున్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అక్కడ ఎన్సీపీ బలం తగ్గుతుందని, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక మరాఠ్వాడాలో మంచి పట్టున్న అశోక్ చవాన్‌కు ఔరంగాబాద్ ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ అప్పచెప్పింది.
గత లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువును ఆయనే కాపాడారు. మరాఠ్వాడ నుంచి ఆయనతోపాటు మరో కాంగ్రెస్ ఎంపీ మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఔరంగాబాద్‌లో అశోక్ చవాన్ నేతృత్వంలో పార్టీ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఠాణే జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతను బాలాసాహెబ్ థోరాత్, హర్షవర్దన్ పాటిల్‌లకు, పాల్ఘర్ జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు రాధాకృష్ణ విఖేపాటిల్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు.
కరువు ప్రాంతాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు..
కరువు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ 040-71012200 అనే టోల్ ఫ్రీ ఫోన్ నెంబరును ప్రారంభించింది. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగివచ్చి జనవరి 9వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా ఆ రోజున గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మంత్రాలయలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ‘ప్రేరణ ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
Published Sun, Jan 4 2015 10:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement