'టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారు'
డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌టౌన్ : నిర్మల్ పట్టణంలో, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన నివాస భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ నేతలను అడ్డుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్మల్‌లోని పురాతన చారిత్రక కట్టడాలు, గొలుసు కట్టు చెరువులు, కోట బురుజులను మంత్రి తన సోదరులతో కలిసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని ధర్మసాగర్ చెరువును సైతం మంత్రి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోనే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. అవసర మయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నుట్ల తెలిపారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.