స్టాలిన్‌తో నగ్మా బేటీ
సాక్షి, చెన్నై: డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా భేటీ అయ్యారు. సోమవారం అన్నా అరివాలయంలో అరగంట పాటుగా ఈ భేటీ సాగింది. మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా గత కొంత కాలంగా తన దృష్టిని తమిళనాడు మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి ఉన్నారు. మహిళా కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు, కేడర్‌తో మమేకం అయ్యే విధంగా ముందుకు సాగుతున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటన నిమిత్తం ప్రత్యేక కార్యాచరణతో ఉరకలు తీస్తున్న నగ్మా ఆదివారం దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా చర్చకు తెర లేపిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సోమవారం అన్నా అరివాలయం చేరుకున్న నగ్మా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆమెకు స్టాలిన్ సాధర స్వాగతం పలికారు. అరగంట పాటుగా తమిళ రాజకీయ పరిస్థితుల గురించి వీరి బేటీ సాగింది. అనంతరం మీడియాతో నగ్మా మాట్లాడుతూ డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిసినట్టు వివరించారు.
డీఎంకే, కాంగ్రెస్ కలిసి కట్టుగా ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడులో పాలన మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. పదవుల్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీద చూపుతున్న శ్రద్ధ ప్రజల మీద చూపించడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వ ఖజానా దోపిడీ లక్ష్యంగా పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు నిదర్శనం ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఓటు కోసం నోట్ల కట్టలు తాండవించడమేనని గుర్తు చేశారు.
వైఎంసీఏలో వజ్రోత్సవం: జూన్ మూడో తేదీ ప్రజల్లోకి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి రానున్నారన్న సమాచారాన్ని ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన జన్మదినోత్సవాన్ని రాజకీయ వజ్రోత్సవంగా జరుపుకునేందుకు డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకు వేదికగా చెన్నై వైఎంసీఏ మైదానాన్ని ఎంపిక చేశారు. ఈ విషయంపై స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల సూచన మేరకు కరుణానిధి ఆ రోజున వేదిక మీదకు వచ్చే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు. అధినేత కరుణానిధి రాజకీయ వజ్రోత్సవ వేడుకకు జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరవుతారన్నారు. వైఎంసీఏ మైదానంలో ఏర్పాట్లకు నిర్ణయించామని తెలిపారు.