కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
Published Sun, Nov 10 2013 11:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు దఫాలుగా చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ విమర్శించారు. ‘అవి అబద్ధాల పుట్టలు. ఈ ఏడాది వారు చేసే హామీలకు ముందు పాత హామీల మాటేమిటని మేం ప్రశ్నిస్తాం..’ అని ఆయన అన్నారు. ఆయన ఆది వారం మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు అబ ద్ధాలు చెప్పి మభ్యపెట్టడంలో కాంగ్రెస్‌వారికి చాలా అనుభవం ఉంది..’ అని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టో అనే పదానికి అర్థాన్నే మార్చేసిం ది..’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘నగరంలో రుకేగీ నహీ మేరీ ఢిల్లీ అనే స్లోగన్‌తో వారు చాలా పెద్ద హోర్డింగ్ ఏర్పాటుచేశారు.
అది కూడా అబద్ధమే.. నగరంలో చాలా ఏళ్లుగా అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడంలేదు..’ అంటూ ఆయన విమర్శించారు. 2003, 2008 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న సుమారు 21 అంశాలను ఆ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం ముట్టుకోలేదు..’ అంటూ ఆయన ఆరోపించారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాను తీసుకొస్తామని 2003 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది.. ఆ తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ అధికారాన్ని చెలాయిస్తోంది.. ఇప్పటివరకు ఆ అంశంపై అతీగతీ లేదు.. ఈసారి కూడా మేనిఫెస్టోలో అదే హామీని ఆ పార్టీ ఇవ్వబోతోందా..’ అంటూ ఆయన ప్రశ్నించారు.
అలాగే 2003, 08 మేనిఫెస్టోల్లోనే ఢిల్లీని విద్యుత్ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించే రాష్ర్టంగా మారుస్తామని హామీ ఇచ్చిందని, కాని వాస్తవం దానికి విరుద్ధంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. గోయల్ మాట్లాడుతూ మరో 10-12 రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనుందని తెలిపారు. తాము చేయగలిగే పనులనే అందులో పొందుపరుస్తామన్నారు. పార్టీ టికెట్లు దొరకలేదని రాజీనామాలు చేస్తున్నవారిపై మీ వైఖరేమిటనే ప్రశ్నకు గోయల్ సమాధానమిస్తూ ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలేనన్నారు. సవాళ్లను తాము ఎదుర్కోగలమనే ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాతే మిగిలిన ఎనిమిది సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా ఇస్లాం మతగురువు మౌలానా తౌకీర్ రజాఖాన్‌ను కేజ్రీవాల్ కలవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అటువంటి పార్టీకి ప్రజలు మద్దతు పలకబోరని ఆ పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ విమర్శించారు.
Advertisement