ఈ గవర్నర్‌ మాకొద్దు | Congress MLAs Complaint on Lieutenant Governor Kiran Bedi | Sakshi
Sakshi News home page

ఈ గవర్నర్‌ మాకొద్దు

Published Tue, Apr 4 2017 1:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఈ గవర్నర్‌ మాకొద్దు - Sakshi

ఈ గవర్నర్‌ మాకొద్దు

కిరణ్‌బేడీపై వ్యతిరేకత ∙
స్పీకర్‌కు 3 పార్టీల లేఖాస్త్రం
రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు
  పుదుచ్చేరిలో ముదిరిన ఆధిపత్య పోరు


సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార ఆధిపత్య పోరు మరింతగా ముదిరింది. అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ ఉల్లంఘించడం వివాదానికి దారి తీసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి వ్యతిరేకంగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గవర్నర్‌ తమకు వద్దే వద్దు అని, వెనక్కు పంపించా ల్సిందేనంటూ స్పీకర్‌ వైద్యలింగంకు ఆ పార్టీల ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీని కేంద్రం రంగంలోకి దించింది. దీంతో గవర్నర్, సీఎంల మధ్య తరచూ వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అధికార ఆధిపత్యం కోసం ఇన్నాళ్లు సీఎం, గవర్నర్‌ మధ్య సమరం సాగింది. ప్రస్తుతం సీఎంకు మద్దతుగా స్పీకర్‌ , ఎమ్మెల్యేలు  తోడయ్యారు.

మరో కొత్త వివాదం:  సీఎం తీసుకునే నిర్ణయాలకు గవర్నర్‌ అడ్డు పడటం, గవర్నర్‌  ఉత్తర్వులను సీఎం తుంగలో తొక్కడం వంటి పరిణామాలు ఇన్నాళ్లు పుదుచ్చేరిలో వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గత వారం  మొదలియార్‌ పేట ఎమ్మెల్యే భాస్కరన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుదుచ్చేరి నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ చంద్రశేఖరన్‌ను వెయిటింగ్‌ లిస్టులో పెడుతూ అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ వైద్యలింగం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా చంద్రశేఖరన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే, అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్‌ తప్పుబట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను రద్దు చేయడం మరో కొత్త  వివాదానికి దారి తీసింది. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ గవర్నర్‌ వ్యవహరించడాన్ని అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగానే పరిగణించారు. గవర్నర్‌ కిరణ్‌ బేడీ ఆదేశాల మేరకు చంద్రశేఖరన్‌ సోమవారం మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరించారు. దీంతో గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్, డిఎంకే, అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు  ఏకం అయ్యారు.

సమష్టిగా..
 ప్రభుత్వ నిర్ణయాల్నే కాదు, అసెంబ్లీ నిర్ణయాలు, తీర్మానాలను ఉల్లంఘించే విధంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్, డీఎంకే,అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్‌కు లేఖలు రాశారు. స్వయంగా స్పీకర్‌ వైద్యలింగంకు ఈ లేఖల్ని సమర్పించారు. అందులో ఈ గవర్నర్‌ తమకు వద్దే వద్దు అని,  వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కిరణ్‌ బేడి తీరును ఏకరువు పెడుతూ, ఆ లేఖల్లో పలు అంశాలను వివరించారు.

ఈ లేఖల్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపించేందుకు స్పీకర్‌ నిర్ణయించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి అడుగులు వేయడానికి పుదుచ్చేరి ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. కాగా, సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏక పక్షంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి, అసెంబ్లీకి ప్రత్యేక అధికారాలు ఉన్న విషయాన్ని గవర్నర్‌ పరిగణించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement