కాంగ్రెస్ ఎమ్మెల్సీకి ‘డాన్’ నుంచి కాల్
రూ. 10 కోట్లు ఇవ్వాలని హుకుం
కుమారుడిని చంపేస్తానని బెదిరింపు
పోలీసులను ఆశ్రయించిన రేవణ్ణ
కుమారుడితో పాటు ‘లక్ష్మణ’ చిత్ర దర్శకుడికి పోలీసు భద్రత
బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు హెచ్.ఎం రేవణ్ణకు మాఫియా డాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రూ.10 కోట్ల సొమ్ము ఇవ్వకపోతే అతని కుమారుడు, నటుడు అనూప్‌తోపాటు ‘లక్ష్మణ’ చిత్ర దర్శకుడు చంద్రను చంపుతాననేది సదరు కాల్ సారాంశం. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు పోలీసు భద్రతను పెంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు... జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఈనెల 11న హెచ్.ఎం రేవణ్ణ బెళగావికి వెళ్లారు. అక్కడి పనులను ముగించుకుని అదే రోజు సాయంత్రం బెంగళూరుకు రావడానికి స్థానిక విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో సుమారు 4:40గంటలకు ఆయన సెల్‌ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అయితే సదరు నంబర్ హెచ్.ఎం రేవణ్ణ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించలేదు. అయినా రేవణ్ణ కాల్ రిసీవ్ చేసుకున్నారు. వెంటనే...‘నేను రవి పూజారి. బాగున్నారా. మీ కుమారుడు నటిస్తున్న లక్ష్మణ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టినట్లు ఉన్నారు. నాకు రూ.10 కోట్లు ఇవ్వండి.
అకౌంట్ నంబర్ పంపిస్తాను. లేదంటే...’ అని బెదిరించాడు. దీంతో కోపగించుకున్న రేవణ్ణ కాల్‌ను కట్ చేశారు. అనంతరం సాయంత్రం 5:10 గంటలకు మరోసారి కాల్ చేసి నేను చెప్పినంత డబ్బు ఇవ్వక పోతే నీ కుమారుడితో పాటు చిత్రదర్శకుడి ప్రాణాలు దక్కవు.’ అని బెదిరించారు. ఫోన్‌లో ఏ విషయమూ చెప్పని రేవణ్ణ నేరుగా బెంగళూరు చేరుకుని నగర కమిషనర్ మేఘరిక్‌కు పరిస్థితి మొత్తం వివరించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవణ్ణ, అతని కుమారుడు అనూప్, లక్ష్మణ చిత్ర దర్శకుడు చంద్రకు పోలీసు భద్రత పెంచారు. ఈ బెదిరింపు కాల్ విషయమై రేవణ్ణ మాట్లాడుతూ...‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు. భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తుండటం వల్లే బెదిరింపు కాల్ వచ్చింది. నేను ఇలాంటి వాటికి భయపడను. పోలీసులు నాకు భద్రత పెంచడమే కాకుండా నా కుమారుడు అనూప్‌తో పాటు చిత్రదర్శకుడు చంద్రుకు పోలీసు భద్రత కల్పించారు.’ అని అన్నారు. ఇదిలా ఉండగా, రేవణ్ణ నివసిస్తున్న ప్రాంతమైన మహాలక్ష్మీలే అవుట్ పోలీస్ స్టేషన్‌లో బెదిరింపుకాల్ విషయమై కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు సీసీబీకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం సీసీబీ పోలీసులు బెళగావి పోలీసు సహకారంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.