సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయంలో సీఎం కేసీఆర్ తప్పు చేయకపోతే తనతో చర్చకు సిద్ధం కావాలని, ఆ చర్చ ఎక్కడ పెట్టినా వస్తానన్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సవాల్ చేశారు. పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల ఉన్న నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్న కేసీఆర్ ప్రగతిభవన్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కేసీఆర్ ఎక్కడో దాక్కుని ఇతర నాయకులను మాట్లాడిస్తున్నారని, ఆయన్ను బయటకు ఎలా రప్పించాలో తమకు తెలు సని అన్నారు.
గురువారం అసెంబ్లీ మీడియా హాల్ లో భట్టి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని, ఈ పొలిటికల్ మాఫియాను ఆపకపోతే ప్రజల ఓటుకు విలువ ఉండదని చెప్పారు. భవిష్యత్తులో డబ్బున్న వాళ్లంతా ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసి సీఎంలు, పీఎంలు అవుతారని, అందుకే తాను ఆమరణదీక్షకు కూర్చున్నానని అన్నారు. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
తన పోరాటం ఆరంభం మాత్రమేనని , రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనపై తాను, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై త్వరలోనే వివిధ వర్గాల మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెపుతున్నారని, కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు, ఆ తర్వాత వారే నాయకులుగా ఉన్నారని, అప్పుడు పార్టీ నుంచి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే వెళుతున్నామని చెబుతున్నారని, పార్టీ మారకపోతే ఈ ప్రభుత్వ పెద్దలు విపక్ష నేతల నియోజకవర్గాలను అభివృద్ధి చేయరా అని ప్రశ్నించారు. పార్టీ మారిన వారంతా రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో గెలవాలని భట్టి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment