సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేగా తానెంతో బాధపడ్డానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్ ఏం చేసిందో చర్చించి తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. ‘మీరు 100కి 100 శాతం మేనిఫెస్టో అమలు చేశారా? నేను చాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో మీకు నచ్చిన ఏ మేజర్ గ్రామ పంచాయతీ అయినా మీరే ఎంచుకోండి. అక్కడ గ్రామసభ పెట్టి ప్రజలతో చర్చిద్దాం.
ఆ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారో.. ఎందరికి మూడెకరాల భూమి ఇచ్చారో, ఎన్ని కేజీ టు పీజీ విద్యాసంస్థలు ఏర్పాటు చేశారో.. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారా లేదా.. ముస్లిం, గిరిజనులకు చెప్పినట్టు రిజర్వేషన్లు అమలు చేశారా లేదా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా లేదా చర్చిద్దాం. ప్లీనరీలో మీరు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటే చర్చకు రావాలని డిమాండ్‌తో పాటు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ వస్తారో, కేటీఆర్ వస్తారో రండి.. మేమూ వస్తాం’అని వ్యాఖ్యానించారు. ఇలాంటివన్నీ ప్రజలు ప్రశ్నిస్తారనే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టిస్తానని అంటున్న కేసీఆర్ వికృత మనస్తత్వం ఎలాంటిదో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. భూకంపాలు, సునామీలు రావాలని పాలకులు కోరుకోరని.. ప్రజలంతా సంతోషంగా, సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారని ఎద్దేవా చేశారు.
జేడీఎస్‌కు రూ.100 కోట్లు!
స్వరాష్ట్రం వస్తే తమ నిధులు తమకే ఖర్చవుతాయని తెలంగాణ ప్రజలు భావించారని.. అయితే, తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలకు పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారని భట్టి విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు రూ.100 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని ఆరోపించారు. బీజేపీకి ఏజెంట్‌గా మారిన కేసీఆర్ కాంగ్రెస్ అనుకూల పార్టీలన్నింటినీ డబ్బుతో కొనేసి బీజేపీ బీ–టీమ్‌గా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ కేసీఆర్ అవకతవకలకు పాల్పడుతున్నారని భట్టి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment