‘మీరు కూడా పార్టీ మారుతారా’.. భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు | Mallu Bhatti Vikramarka Interesting Comments On Congress Party | Sakshi
Sakshi News home page

‘నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను’.. ఆసక్తికరంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Published Mon, Aug 8 2022 2:20 AM | Last Updated on Mon, Aug 8 2022 2:21 AM

Mallu Bhatti Vikramarka Interesting Comments On Congress Party - Sakshi

సాక్షి, ఖమ్మం/హైదరాబాద్‌: ‘నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను. పార్టీ సీనియర్లు అందరితోనూ మాట్లాడుతా.. నేతలు, శ్రేణులు అధైర్యపడొద్దు’అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మీరు కూడా పార్టీ మారుతారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, ఆయన పైవిధంగా స్పందించారు.

కాంగ్రెస్‌ పార్టీని బలహీనపర్చడానికి సోషల్‌ మీడియాలో గోబెల్స్‌ ప్రచారం జరుగుతోందని, ఈ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని సూచించారు. మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోట అని, గతంలో కంటే అత్యధిక మెజారిటీ ఇప్పుడక్కడ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని, వామపక్షాల మద్దతు కూడా అడుగుతామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ ఎంపీ అని, సంగారెడ్డిలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్నారని విలేకరులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పార్టీ ఆంతరంగిక విషయాలను బజారులో పెట్టి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, ఈ విషయాలన్నీ గాంధీ భవన్‌ లేదా ఏఐసీసీ కార్యాలయంలో మాట్లాడుకోవాలన్నారు. 

పార్టీ ప్రయోజనాల కోసం టీపీపీసీ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ ప్లానింగ్‌ కమిషన్‌ను మూసివేసి నీతి అయోగ్‌ను తీసుకురావడమే పెద్ద తప్పన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశాలకు హాజరు అవడం, కాకపోవడం వారి ఇష్టాయిష్టాలకు సంబంధించినదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. పాలనపై అవగాహన లేకుండా బీజేపీ ఇష్టారీతిన వ్యవహరిస్తోందని, స్వాతంత్య్ర పోరాటంలో అడ్రస్‌ లేని బీజేపీ తామే స్వాతంత్ర్యం తెచ్చినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. 

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి నవభారత్‌ను నిర్మించింది కాంగ్రెస్సేనని, ఆ స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’లను నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 15 వరకు అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తోందని, జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి సత్తుపల్లి నియోజకవర్గం వరకు 75 కిలోమీటర్ల మేర తాను పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, జావిద్, వీరభద్రం పాల్గొన్నారు. 

‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’లను విజయవంతం చేయాలి...
అంతకుముందు... ఆజాదీ గౌరవ్‌ యాత్రలపై అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవ స్వరో్ణత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’లను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరగనున్న ఈ యాత్రల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనేలా డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కాంగ్రెస్‌ పోరాటంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, నవ భారత నిర్మాణం కోసం కాంగ్రెస్‌ చేసిన పోరాటాలు, త్యాగాలను యాత్రల ద్వారా వివరించాలన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ భారీ జాతీయ జెండాలతో అన్ని నియోజకవర్గాలు కలిసే విధంగా యాత్రలు నిర్వహించాలని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఎలా అందించిందో ఈ యాత్రల్లో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ వర్గానికే పదవులు.. హరీశ్‌ వర్గాన్ని అణగదొక్కుతున్నారు’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement