రాహుల్ కొత్తబాట
జిల్లాలోనే ఇంటర్వ్యూలు
నేడు కుమరిలో
సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజకీయ పార్టీల ఇంటర్వ్యూలకు భిన్నంగా అభ్యర్థుల ఎంపిక మీద ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టి పెట్టారు. కొత్త బాటకు శ్రీకారం చుడుతూ అభ్యర్థుల ఎంపిక బాధ్యతల్ని ఆయా జిల్లాల అధ్యక్షులు, పర్యవేక్షకులకు అప్పగించారు. ఎన్నికల వేళ దరఖాస్తుల్ని ఆహ్వానించడం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టడం రాష్ట్రంలోని పార్టీలు అనుసరిస్తూ వస్తున్న విధానం. ఇంటర్వ్యూలు మాత్రం పార్టీల అధినేతలు, ముఖ్య నాయకుల సమక్షంలో జరుగుతాయి. ఆ దిశగా తాజాగా ఇంటర్వ్యూల పర్వం ఆయా పార్టీల్లో సాగుతోంది. ఇక, కాంగ్రెస్‌లోనూ దరఖాస్తుల పర్వం ముగిసింది.
ఇక ఇంటర్వ్యూలకు తగ్గ ఆదేశాల కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఎదురు చూపుల్లో పడ్డారు. అయితే, టీఎన్‌సీసీ అధ్యక్షుడి చుట్టూ గ్రూపు సెగల మంటలు రగలుతున్న దృష్ట్యా, తాజా ఇంటర్వ్యూల ప్రక్రియకు స్వస్తి పలికే పనిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయించి ఉన్నారు. రాష్ర్టంలో నేతలు చిదంబరం, తంగబాలు, ఈవీకేఎస్ అంటూ గ్రూపుల రచ్చ సాగుతున్న సమయంలో ఈ ఇంటర్వ్యూల పర్వాన్ని కొత్త బాటలో సాగించేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి దరఖాస్తులు చేసుకున్న ఆశావహుల్ని ఆహ్వానించడం, ఇన్‌చార్జ్‌ల సమక్షంలో ఇంటర్వ్యూలు జరపడం అన్న వ్యవహారాల్ని పక్కన పడేసి, జిల్లాల్లోనే నియోజకవర్గాల వారీగా ఇంటర్వ్యూలకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు.
ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి స్థానిక నేతలకే ఎక్కువ అవగాహన ఉంటుందన్న విషయాన్ని రాహుల్ పరిగణించినట్టున్నారు. దీంతో ఆయా జిల్లాల అధ్యక్షులు, ఆయా జిల్లాల పర్యవేక్షకులు, నియోజకవర్గ పర్యవేక్షకుల సమక్షంలో ఇంటర్వ్యూల్ని సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలు ఎప్పడు ఏ తేదీలో ఏ జిల్లాల్లో జరపాలన్న ఆదేశం సైతం ఢిల్లీ నుంచి వస్తుండటం గమనార్హం. ఆయా జిల్లాల్లో సాగే ఇంటర్వ్యూల ఆధారంగా ఆశావహుల చిట్టా ఢిల్లీకి చేరుతుంది. ఆ చిట్టా ఆధారంగా తుది జాబితాను రాహుల్ ప్రకటించే విధంగా కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఆ మేరకు బుధవారం కన్యాకుమారి జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీకి దరఖాస్తులు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు జరగబోతుండడం గమనించాల్సిన విషయం. కొత్త బాటతో గ్రూపుల అధినేతలకు చెక్ పెట్టడమే కాకుండా, పార్టీ కోసం శ్రమిస్తున్న స్థానిక నాయకుల వివరాలు అధిష్ఠానం దృష్టికి వచ్చే అవకాశాల ఉన్నాయని రాహుల్ గ్రహించి ఉన్నారంటూ ఓ నేత పేర్కొన్నారు.