tamil nadu election
-
అమ్మ ఇంటికేనా? కరుణకు కలిసొస్తుందా?
బద్ధ శత్రువులైన జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే, కరుణానిధి సారథ్యంలోని డీఎంకే మధ్యే ఈసారి కూడా తమిళనాడు అసెంబ్లీ పోరు జరిగిందని స్పష్టమవుతోంది. తాజా ఎన్నికలూ ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా జరిగాయని అంచనాలు చాటుతున్నాయి. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని ఎండీఎంకే ఈసారి కింగ్ మేకర్‌గా అవతరిస్తానని కలలు కన్నప్పటికీ, అవి కల్లలేనని పోలింగ్ అనంతర అంచనాలు చెప్తున్నాయి. విలక్షణమైనవిగా, ఎవరి అంచనాకు అందనివిగా పేరొందిన తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఇటు జయలలిత, అటు కరుణానిధిగా ఆందోళనగానే ఉన్నారు.. ఎందుకంటే.. 1) మార్పు అనివార్యమా: 1984 నుంచి తమిళనాడు ఎన్నికలను గమనిస్తున్న వారు ఈసారి జయలలిత అధికారం నుంచి దిగిపోవడం ఖాయమనే అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. 1984 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించడం, ప్రతిపక్షానికి అధికారం కట్టబెట్టడం తమిళ తంబీలు ఆనవాయితీగా మార్చుకున్నారు. 2011 ఎన్నికల్లో జయలలిత భారీ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించారు. కాబట్టి ఈసారి వంతు డీఎంకేదే. అయితే, ఈసారి డీఎంకే బలహీనంగా కనిపిస్తుండటం, 92 ఏళ్ల ఆ పార్టీ సీఎం అభ్యర్థి కరుణానిధి అంత ప్రభావవంతంగా లేకపోవడంతో ఈసారి ట్రెండ్ మారవచ్చునని అంటున్నారు. జయలలిత రెండోసారి సీఎం అయ్యే అవకాశముందనే అంచనాలు కూడా వెలువడ్డాయి. 2) థర్డ్ ఫ్రంట్ గతి ఏమిటి?: తమిళనాడులో తొలిసారి బలమైన మూడో ప్రత్యామ్నాయం పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీడబ్ల్యూఎఫ్) రూపంలో తెరపైకి వచ్చింది. కెప్టెన్ విజయ్‌కాంత్ సీఎం అభ్యర్థిగా, చిన్నచితక పార్టీలతో ఏర్పడిన థర్డ్ ఫ్రంట్ ఈసారి బలమైన ప్రభావం చూపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఏమేరకు గండి కొడుతుందన్న దానిపైనే విజయ్‌కాంత్ పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయి. అయితే, ఈ మూడో ప్రత్యామ్నాయం సంప్రదాయ ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేకు గట్టి పోటీ ఇవ్వలేదనే విశ్లేషణలు చాటుతున్నాయి. 3) ఒంటరి బీజేపీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి ఏ మిత్రపక్ష పార్టీ తోడు నిలువలేదు. అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చునని ఎన్నికల ముందువరకు భావించినప్పటికీ అది నిజం కాలేదు. ఒంటరిగా బరిలోకి దిగన బీజేపీ ఆశలేమీ పెట్టుకోకపోయినప్పటికీ తమ ఓటుశాతం పెరుగొచ్చని ఆశిస్తోంది. -
అంతా నేనే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తరఫున అన్ని అసెంబ్లీ స్థానాల్లో తానే పోటీ చేస్తున్నట్లుగా భావించి గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు అధినేత్రి జయలలిత పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక లేఖ రాశారు. ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి జయలలిత ‘మీ కోసమే నేను, మీ వల్లనే నేను’ అనే నినాదాన్ని మరువకుండా పేర్కొంటారు. ఎన్నికల ప్రచారంలో అదే బాణిని కొనసాగించారు. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలు ఉండగా, ఏడు స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించి, 227 స్థానాలు అన్నాడీఎంకేకు ఉంచుకున్నారు. ఆర్కేనగర్ నుంచి జయలలిత నామినేషన్ వేశారు. కేవలం ఆర్కేనగర్లో మాత్రమే కాదు మిగిలిన 233 స్థానాల్లోనూ జయలలిత పోటీ చేస్తున్నట్లుగా భావించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను పార్టీ కార్యకర్తలతో పంచుకోదలిచానని అన్నారు. తమిళనాడులో ఎప్పటికీ తమ కుటుంబ పాలనే కొనసాగాలని భావించే డీఎంకేకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. అలాగే ప్రజాసేవలో నిరంతరం తరించాలని ఆశించే అన్నాడీఎంకేకు పట్టం కట్టాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కుటుంబపాలన పూర్తిగా విరుద్ధమైనదని అన్నారు. ప్రభుత్వం, పాలన, పార్టీ అంతా తమకే ఉండాలని భావించే డీఎంకే వల్ల సుపరిపాలన చిన్నాభిన్నం అవుతుందని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాలనలో వారసత్వాన్ని సమూలంగా నిర్మూలించాలని కార్యకర్తలను కోరారు. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ బాధ్యతలను క్షేత్రస్థాయిలో విభజించి అప్పగిస్తున్నానని, ఆయా విధుల్లోని వారు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ఒకరి విధుల్లో ఒకరు తలదూర్చడం ద్వారా పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించరాదని సూచించారు. తమిళనాడు ఎన్నికల చరిత్రలో తొలిసారిగా మొత్తం 234 స్థానాల్లో రెండాకుల గుర్తుపై పోటీ చేస్తున్నామని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఆశీస్సులతో అన్నిస్థానాల్లో గెలుపు సాధించి చరిత్ర సృష్టించాలని కోరారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పడేవరకు విశ్రమించరాదని ఆమె పిలుపునిచ్చారు. -
కెప్టెన్ మరో కోణం
చెన్నై: పిడిగుద్దులు గుద్దుతాడు ... ఎదురుగా వెళ్లాలంటే ఆపార్టీ వర్గాలకు భయం. ఇందుకు కారణం ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటాడో అని కార్యకర్తల ఆందోళన... ఆయనే డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్. అయితే, తిరుమంగళం వేదికగా జరిగిన సభలో చమటలు కక్కుతూ తన కోసం భద్రతా విధుల్లో ఉన్న కార్యకర్త మీద కెప్టెన్ కరుణ చూపించడం అందర్నీ అశ్చర్యచకుతుల్ని చేసింది.. డీఎండీకే అధినేత విజయకాంత్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. అది మీడియా అయినా సరే, అభ్యర్థి అయినా సరే, నాయకుడైనా సరే. అందుకే ఆయనతో వ్యవహరించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటారు. అలాగే, ఆయన పక్కకు గానీ, ఎదురుగా గానీ ద్వితీయ శ్రేణి నాయకులెవ్వరూ వెళ్లరు. గత వారం మీడియాను కొట్టేందుకు చేతులు ఎత్తడమే కాదు... ఆ ప్రతాపాన్ని ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించారు కూడా. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి తిరుమంగళంలో జరిగిన ప్రచార సభలో విజయకాంత్ ముక్కోపినే కాదు, మంచోడ్ని కూడా అని చాటుకున్నారు. ప్రచార వేదిక మీదకు విజయకాంత్ రాగానే, ఆయన్ను మదురై జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రజా కూటమి అభ్యర్థులు, ముఖ్య నాయకులు చుట్టుముట్టారు. వారి వలయం నుంచి విజయకాంత్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కార్యకర్తల సమూహంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అలాగే, వేదిక ముందు భాగంలో ఎవ్వరూ విజయకాంత్ వైపుగా దూసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేదికపై విజయకాంత్ ఆశీనుడు అయ్యారు. ఆయనకు ముందుగా గణేషన్ అనే సెక్యూరిటీ చమటలు కక్కుతూ, తడిసి ముద్దయిన యూనిఫాంతో వేదిక ముందు కూర్చుని తనకు భద్రతగా ఉండడాన్ని విజయకాంత్ గుర్తించారు. దీంతో గాలి ఆడక చమటలు కక్కుతున్న గణేషన్ వైపుగా తన చేతిలో ఉన్న ప్రసంగాల పేపర్‌తో ఉన్న అట్టను తీసుకుని విసరడం మొదలెట్టారు. ఉన్నట్టుండి చల్లగాలి హాయిగా వస్తుండడాన్ని గణేషన్ ఆశ్వాదిస్తూ, ఎక్కడి నుంచి వస్తుందో తలెత్తి చూసి చటుక్కున అక్కడి నుంచి తప్పుకున్నారు. అయితే, ఇక్కడ గణేషన్ మీద కెప్టెన్ జాలి చూపిస్తే, గణేషన్ ఏమో కెప్టెన్ ఎక్కడ అట్టతో కొడుతారేమో...! అన్న ఆందోళనతో తప్పుకున్నట్టుగా వేదిక ముందున్న వాళ్లు, వేదిక మీదున్న వాళ్లు చమత్కారాలు విసిరే పనిలో పడ్డారటా. చివరకు తన మీద కెప్టెన్ చూపిన జాలికి గణేషన్ తలగోక్కోవడం, దీనిని కెప్టెన్ చిరునవ్వులు చిందించడం విశేషం. -
30 రోజుల్లో ... రూ. 35 కోట్లు స్వాధీనం
తమిళనాడు ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు మంత్రి అనుచరుని ఇంటిలో రూ.5 కోట్లు జైలు బెదిరింపులు బేఖాతర్ చెన్నై: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతుండగా నేతలు, అభ్యర్థులు మాత్రం కాసులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నగదు బట్వాడాకు పాల్పడితే జైలు ఖాయమన్న ఎలక్షన్ కమిషన్ బెదిరింపులు బేఖాతర్ అంటూ నేతలు సవాల్ విసురుతున్నారు. నెలరోజుల్లో రూ.35 కోట్లు స్వాధీనం కావడం ఈసీని కంగారుపెడుతోంది. ఓటుకు నోటు ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమేనని ఎన్నికల కమిషన్ ప్రచారం చేసింది. పట్టుబడ్డారంటే ఏడాది జైలు ఖాయమని ఎన్నోసార్లు హెచ్చరించింది. అయితే ఎన్నికల్లో గెలిచామనేదే ముఖ్యంకానీ ఎలా గెలిచామని ఎవ్వరూ అడగరనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలూ ఒంటపట్టించుకున్నాయి. నోటు వెదజల్లితేగానీ సీటు దక్కదని నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒక సీటు కోసం ఎన్నినోట్లు వెదజల్లడానికైనా సిద్ధపడుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో పగటి వేళ ఎన్నికల అధికారుల నిఘా పెరగడంతో అర్థరాత్రి దాటిన తరువాత, తెల్లవారుజామున కొన్ని పార్టీల నేతలు ఇళ్ల ముందు చీరలు, పంచెలు, బిరియానీ, క్వార్టర్ బాటిళ్లను ఉంచి వెళ్లారు. ఉదయాన్నే వాకిలి చిమ్మేందుకు వచ్చిన గృహిణులు వాటిని భద్రంగా ఇంటిలో పెట్టుకున్నారు. దండాలు పెట్టుకుంటూ పగటి వేళ ప్రచారానికి వచ్చిన అభ్యర్థులు వస్తువులు ముట్టినాయా అని అడగడం ద్వారా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అలాగే నోటు చేతిలో పడనిదే గడపదాటని ఓటర్లు కూడా కొందరున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తులు నగదు బట్వాడా తమ వీధిలో జరగలేదంటూ పార్టీ కార్యాలయానికి వెళ్లి మరీ తగవుపెట్టుకున్నారు. రాను రానూ ఓటుకు నోటు సహజంగా మారిపోవడంతో అభ్యర్థులు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. నెలరోజుల్లో రూ.35 కోట్లు: చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించగానే గత నెల 20 వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులు రాత్రికి రాత్రే వాహన తనిఖీలు ప్రారంభించారు. రూ.50వేలకు మించి నగదు పట్టుబడితే డాక్యుమెంట్లు చూపాలని, లేనిపక్షంలో స్వాధీనం చేసుకుంటామని ఈసీ యథావిధిగా ప్రకటించింది. అనేక హెచ్చరికలు కూడా చేసింది. అయితే ఈ హెచ్చరికల ప్రభావం అభ్యర్థులపై పడిందోలేదో గానీ భారీమొత్తంలో డబ్బు పట్టుపడుతూనే ఉంది. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి రూ.30 కోట్లు పట్టుబడింది. రెండురోజుల క్రితం కేరళ, తమిళనాడు సరిహద్దులో రూ.1.36 కోట్లు, శుక్రవారం రాత్రి కొరటూరులో రూ.63 లక్షలు నగదు పట్టుబడింది. మంత్రి అనుచరుని ఇంటి నుంచి రూ.5 కోట్లు: ఇదిలా ఉండగా, మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరునిగా చెప్పబడుతున్న వ్యక్తి గిడ్డంగిపై శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన నగదు పట్టుబడి కలకలం రేపింది. కరూరు సమీపం అయ్యంపాళంలో నత్తం విశ్వనాథన్ అనుచరుడిగా చెప్పబడుతున్న అన్బునాథన్కు ఫాంహౌస్, గిడ్డంగి ఉంది. ఆ గిడ్డంగిలో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచినట్లు ఈసీ రాజేష్లఖానీకి సమాచారం అందడంతో కరూర్ జిల్లా ఎస్పీ, అతని ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మాత్తుగా రైడ్ చేశారు. మరికొద్ది సేపట్లో అభ్యర్థుల ఖర్చుల వివరాలను సేకరించే ఐఆర్ఎస్ అధికారులు చేరుకున్నారు. గిడ్డంగి నుంచి ఎస్పీ వెలుపలికి వచ్చి... వివరాలు ఏమీ చెప్పకుండా వెళ్లిపోయారు. సమీపంలోని అన్బునాథన్ ఇంట్లో కూడా రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.5 కోట్లు కంటపడడంతో అధికారులకు కళ్లుతిరిగినంత పనైంది. అన్బునాథన్ గిడ్డంగిలో సైతం నగదు దొరికినట్లు సమాచారం. శుక్రవారం అర్ధ రాత్రి దాటిన తరువాత సైతం తనిఖీలు సాగాయి. -
టైం మార్చుకున్న అమ్మ
సాయంత్రం పూట ప్రచారానికి అమ్మ మొగ్గు వరుస మరణాలతో పర్యటనలో మార్పు నేడు తిరుచ్చిలో జయ ప్రచారం చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలు మృత్యుకుహరాలుగా మారిపోయాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో అధినేత్రి జయలలిత పర్యటనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత చట్టసభ ఎన్నికల ప్రచారం నిమిత్తం పరిమితమైన నగరాలను ఎంచుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఎన్నికల వేదికకు చేరుకుని ప్రసంగాలు చేస్తున్నారు. మరలా అదే మార్గంలో రాత్రికి చెన్నైకి చేరుకుంటున్నారు. విరుదాచలం, సేలం, అరుప్పుకోట్టైలలో జరిగిన బహిరంగ సభలకు నాలుగైదు గంటల ముందుగానే జనాన్ని కూర్చోబెడుతున్నారు. పైకప్పు లేకుండా ఆరుబయల్లో మండుతున్న ఎండల ధాటికి ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాహానికి నీరులేక, జనాన్ని దాటుకుం టూ మైదానం విడిచి వెళ్లలేక అవస్తలు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జయ ప్రచార సభలకు హాజరైన వారిలో శుక్రవారం నాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికలు ము గిసిన తరవాత మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తానని జయలలిత హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల ధ్వజం-సీఈసీ నివేదిక అన్నాడీఎంకేను అప్రతిష్టపాలు చేసేందుకు సిద్దంగా ఉన్న ప్రతిపక్షాలకు అమ్మ ప్రచార సభలు అవకాశాన్ని ఇచ్చాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర సాగింది. డీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి నేతలు వేర్వేరుగా ఈసీ ఫిర్యాదు చేశారు. డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ది విజయకాంత ఇకపై తన ప్రచార కార్యక్రమాలు సాయంత్రం వేళల్లో మాత్రమే సాగుతాయని తెలిపారు. తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ఈసీ రాజేష్లఖానీని కలిసి అన్నాడీఎంకేపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు అమ్మ ప్రచార పోకడలపై నివేదికను పంపారు. జయ సైతం ఇక సాయంకాలం: అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలో వివాదాస్పదం కావడంతో జయలలిత తన పర్యటనలను మార్చుకున్నారు. సహజంగా జయలలిత ప్రచార సభలు మధ్యాహ్నం వేళ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సభల్లో ఐదు మంది మృతిచెందారు. దీంతో శనివారం నాటి తిరుచ్చి పర్యటన సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. తిరుచ్చి వేదికపై నుంచి 18 మంది అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయాలని తొలుత భావించ గా 67 మంది అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. ఇక అన్ని సభలో సాయంత్రం వేళనే సాగేలా మార్పులు జరుగుతున్నాయి. -
ఆర్కేనగర్లో అందరూ అమ్మలే
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఆకర్షిస్తున్న ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అమ్మపై మరికొందరు అమ్మలు పోటీపడుతున్నారు. వారందరి మధ్య హిజ్రా అభ్యర్థి ప్రత్యేకంగా మారారు.రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలు ఒక ఎత్తు, చెన్నైలోని ఆర్కేనగర్ ఒక ఎత్తు. ఎందుకంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీ చేస్తోంది కనుక. తమిళనాడు ప్రజల చేత అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ప్రస్తుత ఎన్నికల్లో ఆర్కేనగర్ నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. జయలలిత నిర్ణయంతో ఆర్కేనగర్ మహిళా అభ్యర్థుల నిలయంగా మారిపోయింది. జయపై పోటీకి పెట్టే అభ్యర్థుల్లో ఏదోఒక ప్రత్యేకత, ఆకర్షణ ఉండాలని ప్రతిపక్ష పార్టీలన్నీ భావించాయి. అనేక పేర్లతో తర్జనభర్జన పడ్డాయి. అయితే ఎట్టకేలకూ మహిళా అభ్యర్థినే నిలబెట్టాలని నిర్ణయించిన తరువాత తగిన అభ్యర్థిని కోసం వెతుకులాట ప్రారంభమైంది. జయలలిత ప్రస్థానం: రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత జయలలిత తొలిసారిగా 1989 లో పోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1991లో బర్గూర్, కాంగేయం ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి రెండుచోట్లా గెలుపొందారు. 1996లో బర్గూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2002, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆండిపట్టి నుంచి విజేతగా నిలిచారు. 2011 ఎన్నికల్లో తిరుచ్చి శ్రీరంగం నుంచి పోటీచేసి గెలుపొందిన జయలలిత ఆస్తుల కేసుల వల్ల మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత 2015లో ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపొంది సీఎం పీఠం ఎక్కారు. ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థిగా ఆర్కేనగర్ నుంచే తలపడుతున్నారు. డీఎంకే నుంచి మహిళా న్యాయవాది: ఇక అన్నాడీఎంకే దీటైన పోటీ ఇవ్వగల డీఎంకే మహిళా న్యాయవాదిని రంగంలోకి దించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బును పోటీపెట్టడం ద్వారా ప్రజాకర్షణ చూరగొనవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే డీఎంకే మాత్రం ఆర్కేనగర్‌ను తమ అభ్యర్థికే కేటాయించింది. మహిళా న్యాయవాది సిమ్లాను అభ్యర్థిగా రంగంలోకి దించింది. విద్యాధికురాలిగా పదునైన ప్రసంగాలతో ప్రచారం చేసే శక్తి ఆమెకు ఉందని డీఎంకే విశ్వసిస్తోంది. వీసీకే నుంచి మాజీ మాజీ వీసీ పోటీ: ఇదిలా ఉండగా, ప్రజా సంక్షేమ కూటమి సైతం మహిళా అభ్యర్థిని పెట్టింది. సంక్షేమ కూటమిలో భాగస్వామి వీసీకే అధినేత తిరుమావళవన్ తమ అభ్యర్థిగా మాజీ వైస్ చాన్సలర్ వసంతీదేవిని పోటీకి పెట్టారు. జయపై వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీచేయాలని ముందు భావించారు. అయితే అందరూ మహిళా అభ్యర్థులు కావడంతో అభిప్రాయం మార్చుకున్నారు. వసంతీదేవి సైతం ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఓటర్ల మెప్పుపొందగలరని సంక్షేమ కూటమి ఆశిస్తోంది.కాగా ఒంటరిగా బరిలో ఉన్న పీఎంకే ఆగ్నిస్ అనే మహిళకు అవకాశం ఇచ్చింది. ఆర్కేనగర్ నుంచి జయలలితకు పోటీగా పురుషులు నిలబడతారని సహజంగా అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యరీతిలో అందరూ మహిళలను నిలబెట్టడం అమ్మకు ఒకింత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీలు మహిళా అభ్యర్థులను నిలబెడితే భారతీయ జనతా పార్టీ మాత్రమే పురుషుడిని నిలబెట్టింది. హిజ్రా ప్రత్యేక ఆకర్షణ: అన్ని పార్టీల మాట అటుంచితే నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించారు. సి.దేవి అనే హిజ్రాను అమ్మపై పోటీపెట్టడంతో ఇదొక ప్రత్యేక ఆకర్షణగా, చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో హిజ్రాలు ఉండగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా వారంతా ఆర్కేనగర్లో సందడి చేయడం ఖాయం. -
చిన్న పార్టీల్లోనూ సత్తా
భలే కూటమి! సాక్షి, చెన్నై: పెద్ద పార్టీలేనా కూటముల్ని ఏర్పాటు చేసేది, తామూ రెడీ అంటూ చిన్న పార్టీలు కదిలాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే చేత చీదరించ బడ్డ వాళ్లే ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు మద్దతుగా చిన్న పార్టీలు, సామాజిక వర్గ పార్టీలు పెద్ద సంఖ్యలో కదిలిన విషయం తెలిసిందే. అయితే, అందరికీ ఆ కూటముల్లో చోటు దక్కలేదు. చివరి క్షణంలో పెద్ద పార్టీలు తమకు హ్యాండ్ ఇవ్వడంతో ఇక తమ సత్తా ఏమిటో చాటుదామన్న నిర్ణయానికి పలు చిన్న పార్టీలు వచ్చేశాయి. ఇందులో సినీ నటుడు కార్తీక్ కూడా ఉన్నారు. నాడాలుం మక్కల్ కట్చి అధినేతగా ఉన్న కార్తీక్ ‘విడియల్’ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేయడం, అందులో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీ సైతం చేరడం గమనించాల్సిందే. అలాగే, మక్కల్ మహానాడు పార్టీ, తమిళ్ మక్కల్ పార్టీ, దళిత్ సేన, ఇండియా మువ్వేందర్ మున్నని వంటి పార్టీలు వరుసగా చేరడంతో ఇప్పుడు కార్తీక్ బలం పెరిగినట్టుంది. దీంతో ఆగమేఘాలపై ఢిల్లీకి చెక్కేసి, అక్కడ రాం విలాస్ పాశ్వాన్‌తో భేటీ కావడం విశేషం. ఆ భేటీ అనంతరం మీడియాతో కార్తీక్ మాట్లాడుతూ తమ కూటమి బలం పెరిగిందని, పెద్ద పార్టీలకు తమ సత్తాను చాటుతామని దేశ రాజధానిలో జబ్బలు చరచడం భవిష్యత్తులో తాను తమిళనాడుకు సీఎం అవుతానన్న నినాదాన్ని అందుకుంటారేమో. ఇక గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించి అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఫార్వర్డ్ బ్లాక్ నేత కదిరవన్‌కు ఈ సారి కష్టాలు తప్పలేదు.అమ్మ చీదరించుకోవడంతో చివరకు తానూ ఓ కూటమిని ఏర్పాటు చేసుకోవడం గమనించాల్సిందే. ఇందులో అఖిల భారత మువ్వేందర్మున్నేట్ర కళగం, మువ్వేందర్ మున్నని సైతం చేరడంతో తమ కూటమికి ‘సింగం’ జట్టు అని నామకరణం చేయడం విశేషం. -
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాధిక
నటి రాధిక వేలూరు: రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోలేదని సినీ నటి రాధిక తెలిపారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో గురువారం సాయంత్రం సినీ నటి రాధిక తన కుమార్తె రేయాన్, కుమారుడు రాహుల్ శరత్‌తో కలిసి స్వామి దర్శించుకున్నారు అనంతరం స్వామి స్వామి సన్నధి, అమ్మన్ సన్నధిలోని స్వామి వారిని మొక్కుకున్నారు. అనంతరం నవగ్రహ సన్నధిలో నెయ్యి దీపాలను వెలిగించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహం త్వరలో జరుగనుందని అందువల్ల తన కుమార్తె, కుమారుడితో కలిసి స్వామి దర్శనం చేసుకున్నానన్నారు. ఎన్నికలు, రాజకీయాల సంబంధమైన ప్రశ్నలకు శరత్‌కుమార్‌ను అడగాలన్నారు. సమత్తవ మక్కల్ పార్టీ ద్వారా తాను పోటీ చేసేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇందుకు ఇంకా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని, మంచి ప్రభుత్వం ఏర్పాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆమెకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. -
రాహుల్ కొత్తబాట
జిల్లాలోనే ఇంటర్వ్యూలు నేడు కుమరిలో సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజకీయ పార్టీల ఇంటర్వ్యూలకు భిన్నంగా అభ్యర్థుల ఎంపిక మీద ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టి పెట్టారు. కొత్త బాటకు శ్రీకారం చుడుతూ అభ్యర్థుల ఎంపిక బాధ్యతల్ని ఆయా జిల్లాల అధ్యక్షులు, పర్యవేక్షకులకు అప్పగించారు. ఎన్నికల వేళ దరఖాస్తుల్ని ఆహ్వానించడం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టడం రాష్ట్రంలోని పార్టీలు అనుసరిస్తూ వస్తున్న విధానం. ఇంటర్వ్యూలు మాత్రం పార్టీల అధినేతలు, ముఖ్య నాయకుల సమక్షంలో జరుగుతాయి. ఆ దిశగా తాజాగా ఇంటర్వ్యూల పర్వం ఆయా పార్టీల్లో సాగుతోంది. ఇక, కాంగ్రెస్‌లోనూ దరఖాస్తుల పర్వం ముగిసింది. ఇక ఇంటర్వ్యూలకు తగ్గ ఆదేశాల కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఎదురు చూపుల్లో పడ్డారు. అయితే, టీఎన్‌సీసీ అధ్యక్షుడి చుట్టూ గ్రూపు సెగల మంటలు రగలుతున్న దృష్ట్యా, తాజా ఇంటర్వ్యూల ప్రక్రియకు స్వస్తి పలికే పనిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయించి ఉన్నారు. రాష్ర్టంలో నేతలు చిదంబరం, తంగబాలు, ఈవీకేఎస్ అంటూ గ్రూపుల రచ్చ సాగుతున్న సమయంలో ఈ ఇంటర్వ్యూల పర్వాన్ని కొత్త బాటలో సాగించేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి దరఖాస్తులు చేసుకున్న ఆశావహుల్ని ఆహ్వానించడం, ఇన్‌చార్జ్‌ల సమక్షంలో ఇంటర్వ్యూలు జరపడం అన్న వ్యవహారాల్ని పక్కన పడేసి, జిల్లాల్లోనే నియోజకవర్గాల వారీగా ఇంటర్వ్యూలకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి స్థానిక నేతలకే ఎక్కువ అవగాహన ఉంటుందన్న విషయాన్ని రాహుల్ పరిగణించినట్టున్నారు. దీంతో ఆయా జిల్లాల అధ్యక్షులు, ఆయా జిల్లాల పర్యవేక్షకులు, నియోజకవర్గ పర్యవేక్షకుల సమక్షంలో ఇంటర్వ్యూల్ని సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలు ఎప్పడు ఏ తేదీలో ఏ జిల్లాల్లో జరపాలన్న ఆదేశం సైతం ఢిల్లీ నుంచి వస్తుండటం గమనార్హం. ఆయా జిల్లాల్లో సాగే ఇంటర్వ్యూల ఆధారంగా ఆశావహుల చిట్టా ఢిల్లీకి చేరుతుంది. ఆ చిట్టా ఆధారంగా తుది జాబితాను రాహుల్ ప్రకటించే విధంగా కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఆ మేరకు బుధవారం కన్యాకుమారి జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీకి దరఖాస్తులు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు జరగబోతుండడం గమనించాల్సిన విషయం. కొత్త బాటతో గ్రూపుల అధినేతలకు చెక్ పెట్టడమే కాకుండా, పార్టీ కోసం శ్రమిస్తున్న స్థానిక నాయకుల వివరాలు అధిష్ఠానం దృష్టికి వచ్చే అవకాశాల ఉన్నాయని రాహుల్ గ్రహించి ఉన్నారంటూ ఓ నేత పేర్కొన్నారు.