ఆర్కేనగర్‌లో అందరూ అమ్మలే | Tamil Nadu election: VCK to field Vasanthi Devi in Jayalalithaa's RK Nagar constituency | Sakshi
Sakshi News home page

ఆర్కేనగర్‌లో అందరూ అమ్మలే

Published Fri, Apr 22 2016 4:12 PM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

ఆర్కేనగర్‌లో అందరూ అమ్మలే - Sakshi

ఆర్కేనగర్‌లో అందరూ అమ్మలే

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఆకర్షిస్తున్న ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అమ్మపై మరికొందరు అమ్మలు పోటీపడుతున్నారు. వారందరి మధ్య హిజ్రా అభ్యర్థి ప్రత్యేకంగా మారారు.రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలు ఒక ఎత్తు, చెన్నైలోని ఆర్కేనగర్ ఒక ఎత్తు. ఎందుకంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీ చేస్తోంది కనుక.
 
తమిళనాడు ప్రజల చేత అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ప్రస్తుత  ఎన్నికల్లో ఆర్కేనగర్ నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. జయలలిత నిర్ణయంతో ఆర్కేనగర్ మహిళా అభ్యర్థుల నిలయంగా మారిపోయింది. జయపై పోటీకి పెట్టే అభ్యర్థుల్లో ఏదోఒక ప్రత్యేకత, ఆకర్షణ ఉండాలని ప్రతిపక్ష పార్టీలన్నీ భావించాయి. అనేక పేర్లతో తర్జనభర్జన పడ్డాయి. అయితే ఎట్టకేలకూ మహిళా అభ్యర్థినే నిలబెట్టాలని నిర్ణయించిన తరువాత తగిన అభ్యర్థిని కోసం వెతుకులాట ప్రారంభమైంది.
 
 జయలలిత  ప్రస్థానం:
 రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత జయలలిత తొలిసారిగా 1989 లో పోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1991లో బర్గూర్, కాంగేయం ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి రెండుచోట్లా గెలుపొందారు. 1996లో బర్గూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2002, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆండిపట్టి నుంచి విజేతగా నిలిచారు. 2011 ఎన్నికల్లో తిరుచ్చి శ్రీరంగం నుంచి పోటీచేసి గెలుపొందిన జయలలిత ఆస్తుల కేసుల వల్ల మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత 2015లో ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపొంది సీఎం పీఠం ఎక్కారు. ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థిగా ఆర్కేనగర్ నుంచే తలపడుతున్నారు.
 
 డీఎంకే నుంచి మహిళా న్యాయవాది:
ఇక అన్నాడీఎంకే దీటైన పోటీ ఇవ్వగల డీఎంకే మహిళా న్యాయవాదిని రంగంలోకి దించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బును పోటీపెట్టడం ద్వారా ప్రజాకర్షణ చూరగొనవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే డీఎంకే మాత్రం ఆర్కేనగర్‌ను తమ అభ్యర్థికే కేటాయించింది.  మహిళా న్యాయవాది సిమ్లాను అభ్యర్థిగా రంగంలోకి దించింది. విద్యాధికురాలిగా పదునైన ప్రసంగాలతో ప్రచారం చేసే శక్తి ఆమెకు ఉందని డీఎంకే విశ్వసిస్తోంది.
 
 వీసీకే నుంచి మాజీ మాజీ వీసీ పోటీ:
 ఇదిలా ఉండగా, ప్రజా సంక్షేమ కూటమి సైతం మహిళా అభ్యర్థిని పెట్టింది. సంక్షేమ కూటమిలో భాగస్వామి వీసీకే అధినేత తిరుమావళవన్ తమ అభ్యర్థిగా మాజీ వైస్ చాన్సలర్ వసంతీదేవిని పోటీకి పెట్టారు. జయపై వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీచేయాలని ముందు భావించారు. అయితే అందరూ మహిళా అభ్యర్థులు కావడంతో అభిప్రాయం మార్చుకున్నారు.
 
వసంతీదేవి సైతం ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఓటర్ల మెప్పుపొందగలరని సంక్షేమ కూటమి ఆశిస్తోంది.కాగా ఒంటరిగా బరిలో ఉన్న పీఎంకే ఆగ్నిస్ అనే మహిళకు అవకాశం ఇచ్చింది. ఆర్కేనగర్ నుంచి జయలలితకు పోటీగా పురుషులు నిలబడతారని సహజంగా అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యరీతిలో అందరూ మహిళలను నిలబెట్టడం అమ్మకు ఒకింత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీలు మహిళా అభ్యర్థులను నిలబెడితే భారతీయ జనతా పార్టీ మాత్రమే పురుషుడిని నిలబెట్టింది.
 
 హిజ్రా ప్రత్యేక ఆకర్షణ:
అన్ని పార్టీల మాట అటుంచితే నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించారు. సి.దేవి అనే హిజ్రాను అమ్మపై పోటీపెట్టడంతో ఇదొక ప్రత్యేక ఆకర్షణగా, చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో హిజ్రాలు ఉండగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా వారంతా ఆర్కేనగర్‌లో సందడి చేయడం ఖాయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement