అమ్మ నియోజకవర్గంలో ఈసీ రికార్డు
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లకు భారీగా డబ్బు పంచుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈసీ ఏకంగా ఐదుగురు పరిశీలకులను నియమించింది. దేశ ఎన్నికల చరిత్రలో ఓ స్థానానికి ఇంతమంది పరిశీలకులను నియమించడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ 12న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ఇదివరకే ముగ్గురు పరిశీలకులను నియమించింది. కాగా ఓటర్లకు పెద్ద ఎత్తును డబ్బు పంచుతున్నారని డీఎంకే, సీపీఎం తదితర పార్టీలు ఫిర్యాదు చేయడంతో.. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఈసీ మరో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉమేష్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డబ్బు పంపణీకి సంబంధిన ఫిర్యాదులను పరిశీలించేందుకు 12 మందికిపైగా ఆదాయ పన్ను శాఖ అధికారులను ఈసీ నియమించింది. ఉప ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఎన్నికలు జరిగే మొత్తం 256 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక 25 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించనున్నారు.