టైం మార్చుకున్న అమ్మ
సాయంత్రం పూట ప్రచారానికి అమ్మ మొగ్గు
వరుస మరణాలతో పర్యటనలో మార్పు
నేడు తిరుచ్చిలో జయ ప్రచారం
చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలు మృత్యుకుహరాలుగా మారిపోయాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో అధినేత్రి జయలలిత పర్యటనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత చట్టసభ ఎన్నికల ప్రచారం నిమిత్తం పరిమితమైన నగరాలను ఎంచుకున్నారు.
చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల వేదికకు చేరుకుని ప్రసంగాలు చేస్తున్నారు. మరలా అదే మార్గంలో రాత్రికి చెన్నైకి చేరుకుంటున్నారు. విరుదాచలం, సేలం, అరుప్పుకోట్టైలలో జరిగిన బహిరంగ సభలకు నాలుగైదు గంటల ముందుగానే జనాన్ని కూర్చోబెడుతున్నారు. పైకప్పు లేకుండా ఆరుబయల్లో మండుతున్న ఎండల ధాటికి ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దాహానికి నీరులేక, జనాన్ని దాటుకుం టూ మైదానం విడిచి వెళ్లలేక అవస్తలు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జయ ప్రచార సభలకు హాజరైన వారిలో శుక్రవారం నాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికలు ము గిసిన తరవాత మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తానని జయలలిత హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాల ధ్వజం-సీఈసీ నివేదిక
అన్నాడీఎంకేను అప్రతిష్టపాలు చేసేందుకు సిద్దంగా ఉన్న ప్రతిపక్షాలకు అమ్మ ప్రచార సభలు అవకాశాన్ని ఇచ్చాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర సాగింది. డీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి నేతలు వేర్వేరుగా ఈసీ ఫిర్యాదు చేశారు. డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ది విజయకాంత ఇకపై తన ప్రచార కార్యక్రమాలు సాయంత్రం వేళల్లో మాత్రమే సాగుతాయని తెలిపారు.
తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ఈసీ రాజేష్‌లఖానీని కలిసి అన్నాడీఎంకేపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు అమ్మ ప్రచార పోకడలపై నివేదికను పంపారు.
జయ సైతం ఇక సాయంకాలం:
అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలో వివాదాస్పదం కావడంతో జయలలిత తన పర్యటనలను మార్చుకున్నారు. సహజంగా జయలలిత ప్రచార సభలు మధ్యాహ్నం వేళ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సభల్లో ఐదు మంది మృతిచెందారు. దీంతో శనివారం నాటి తిరుచ్చి పర్యటన సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
తిరుచ్చి వేదికపై నుంచి 18 మంది అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయాలని తొలుత భావించ గా 67 మంది అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. ఇక అన్ని సభలో సాయంత్రం వేళనే సాగేలా మార్పులు జరుగుతున్నాయి.