చిన్న పార్టీల్లోనూ సత్తా
భలే కూటమి!
సాక్షి, చెన్నై: పెద్ద పార్టీలేనా కూటముల్ని ఏర్పాటు చేసేది, తామూ రెడీ అంటూ చిన్న పార్టీలు కదిలాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే చేత చీదరించ బడ్డ వాళ్లే ఉన్నారు.
డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు మద్దతుగా చిన్న పార్టీలు, సామాజిక వర్గ పార్టీలు పెద్ద సంఖ్యలో కదిలిన విషయం తెలిసిందే. అయితే, అందరికీ ఆ కూటముల్లో చోటు దక్కలేదు. చివరి క్షణంలో పెద్ద పార్టీలు తమకు హ్యాండ్ ఇవ్వడంతో ఇక తమ సత్తా ఏమిటో చాటుదామన్న నిర్ణయానికి పలు చిన్న పార్టీలు వచ్చేశాయి. ఇందులో సినీ నటుడు కార్తీక్ కూడా ఉన్నారు.
నాడాలుం మక్కల్ కట్చి అధినేతగా ఉన్న కార్తీక్ ‘విడియల్’ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేయడం, అందులో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీ సైతం చేరడం గమనించాల్సిందే. అలాగే, మక్కల్ మహానాడు పార్టీ, తమిళ్ మక్కల్ పార్టీ, దళిత్ సేన, ఇండియా మువ్వేందర్ మున్నని వంటి పార్టీలు వరుసగా చేరడంతో ఇప్పుడు కార్తీక్ బలం పెరిగినట్టుంది. దీంతో ఆగమేఘాలపై ఢిల్లీకి చెక్కేసి, అక్కడ రాం విలాస్ పాశ్వాన్‌తో భేటీ కావడం విశేషం.
ఆ భేటీ అనంతరం మీడియాతో కార్తీక్ మాట్లాడుతూ తమ కూటమి బలం పెరిగిందని, పెద్ద పార్టీలకు తమ సత్తాను చాటుతామని దేశ రాజధానిలో జబ్బలు చరచడం భవిష్యత్తులో తాను తమిళనాడుకు సీఎం అవుతానన్న నినాదాన్ని అందుకుంటారేమో.
ఇక గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించి అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఫార్వర్డ్ బ్లాక్ నేత కదిరవన్‌కు ఈ సారి కష్టాలు తప్పలేదు.అమ్మ చీదరించుకోవడంతో చివరకు తానూ ఓ కూటమిని ఏర్పాటు చేసుకోవడం గమనించాల్సిందే. ఇందులో అఖిల భారత మువ్వేందర్‌మున్నేట్ర కళగం, మువ్వేందర్ మున్నని సైతం చేరడంతో తమ కూటమికి ‘సింగం’ జట్టు అని నామకరణం చేయడం విశేషం.