30 రోజుల్లో ... రూ. 35 కోట్లు స్వాధీనం | Election Commission has seized Rs 35 crores in Tamil Nadu | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో ... రూ. 35 కోట్లు స్వాధీనం

Published Sun, Apr 24 2016 9:05 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

30 రోజుల్లో ... రూ. 35 కోట్లు స్వాధీనం - Sakshi

30 రోజుల్లో ... రూ. 35 కోట్లు స్వాధీనం

తమిళనాడు ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు
మంత్రి అనుచరుని ఇంటిలో రూ.5 కోట్లు
జైలు బెదిరింపులు బేఖాతర్
 
చెన్నై: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతుండగా నేతలు, అభ్యర్థులు మాత్రం కాసులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. నగదు బట్వాడాకు పాల్పడితే జైలు ఖాయమన్న ఎలక్షన్ కమిషన్ బెదిరింపులు బేఖాతర్ అంటూ నేతలు సవాల్ విసురుతున్నారు. నెలరోజుల్లో రూ.35 కోట్లు స్వాధీనం కావడం ఈసీని కంగారుపెడుతోంది.


ఓటుకు నోటు ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమేనని ఎన్నికల కమిషన్ ప్రచారం చేసింది. పట్టుబడ్డారంటే ఏడాది జైలు ఖాయమని ఎన్నోసార్లు హెచ్చరించింది. అయితే ఎన్నికల్లో గెలిచామనేదే ముఖ్యంకానీ ఎలా గెలిచామని ఎవ్వరూ అడగరనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలూ ఒంటపట్టించుకున్నాయి. నోటు వెదజల్లితేగానీ సీటు దక్కదని నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

ఒక సీటు కోసం ఎన్నినోట్లు వెదజల్లడానికైనా సిద్ధపడుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో పగటి వేళ ఎన్నికల అధికారుల నిఘా పెరగడంతో అర్థరాత్రి దాటిన తరువాత, తెల్లవారుజామున కొన్ని పార్టీల నేతలు ఇళ్ల ముందు చీరలు, పంచెలు, బిరియానీ, క్వార్టర్ బాటిళ్లను ఉంచి వెళ్లారు. ఉదయాన్నే వాకిలి చిమ్మేందుకు వచ్చిన గృహిణులు వాటిని భద్రంగా ఇంటిలో పెట్టుకున్నారు. దండాలు పెట్టుకుంటూ పగటి వేళ ప్రచారానికి వచ్చిన అభ్యర్థులు వస్తువులు ముట్టినాయా అని అడగడం ద్వారా ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు.

అలాగే నోటు చేతిలో పడనిదే గడపదాటని ఓటర్లు కూడా కొందరున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తులు నగదు బట్వాడా తమ వీధిలో జరగలేదంటూ పార్టీ కార్యాలయానికి వెళ్లి మరీ తగవుపెట్టుకున్నారు. రాను రానూ ఓటుకు నోటు సహజంగా మారిపోవడంతో అభ్యర్థులు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు.

నెలరోజుల్లో రూ.35 కోట్లు: చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించగానే గత నెల 20 వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులు రాత్రికి రాత్రే వాహన తనిఖీలు ప్రారంభించారు. రూ.50వేలకు మించి నగదు పట్టుబడితే డాక్యుమెంట్లు చూపాలని, లేనిపక్షంలో స్వాధీనం చేసుకుంటామని ఈసీ యథావిధిగా ప్రకటించింది. అనేక హెచ్చరికలు కూడా చేసింది. అయితే ఈ హెచ్చరికల ప్రభావం అభ్యర్థులపై పడిందోలేదో గానీ భారీమొత్తంలో డబ్బు పట్టుపడుతూనే ఉంది. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి రూ.30 కోట్లు పట్టుబడింది. రెండురోజుల క్రితం కేరళ, తమిళనాడు సరిహద్దులో రూ.1.36 కోట్లు, శుక్రవారం రాత్రి కొరటూరులో రూ.63 లక్షలు నగదు పట్టుబడింది.

మంత్రి అనుచరుని ఇంటి నుంచి రూ.5 కోట్లు: ఇదిలా ఉండగా, మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరునిగా చెప్పబడుతున్న వ్యక్తి గిడ్డంగిపై శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన నగదు పట్టుబడి కలకలం రేపింది. కరూరు సమీపం అయ్యంపాళంలో నత్తం విశ్వనాథన్ అనుచరుడిగా చెప్పబడుతున్న అన్బునాథన్‌కు ఫాంహౌస్, గిడ్డంగి ఉంది.

ఆ గిడ్డంగిలో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచినట్లు ఈసీ రాజేష్‌లఖానీకి సమాచారం అందడంతో కరూర్ జిల్లా ఎస్పీ, అతని ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మాత్తుగా రైడ్ చేశారు. మరికొద్ది సేపట్లో అభ్యర్థుల ఖర్చుల వివరాలను సేకరించే ఐఆర్‌ఎస్ అధికారులు చేరుకున్నారు. గిడ్డంగి నుంచి ఎస్పీ వెలుపలికి వచ్చి... వివరాలు ఏమీ చెప్పకుండా వెళ్లిపోయారు. సమీపంలోని అన్బునాథన్ ఇంట్లో కూడా రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.5 కోట్లు కంటపడడంతో అధికారులకు కళ్లుతిరిగినంత పనైంది.  అన్బునాథన్ గిడ్డంగిలో సైతం నగదు దొరికినట్లు సమాచారం. శుక్రవారం అర్ధ రాత్రి దాటిన తరువాత సైతం తనిఖీలు సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement