అమ్మ ఇంటికేనా? కరుణకు కలిసొస్తుందా?
బద్ధ శత్రువులైన జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే, కరుణానిధి సారథ్యంలోని డీఎంకే మధ్యే ఈసారి కూడా తమిళనాడు అసెంబ్లీ పోరు జరిగిందని స్పష్టమవుతోంది. తాజా ఎన్నికలూ ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా జరిగాయని అంచనాలు చాటుతున్నాయి. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని ఎండీఎంకే ఈసారి కింగ్ మేకర్‌గా అవతరిస్తానని కలలు కన్నప్పటికీ, అవి కల్లలేనని పోలింగ్ అనంతర అంచనాలు చెప్తున్నాయి. విలక్షణమైనవిగా, ఎవరి అంచనాకు అందనివిగా పేరొందిన తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఇటు జయలలిత, అటు కరుణానిధిగా ఆందోళనగానే ఉన్నారు.. ఎందుకంటే..
1) మార్పు అనివార్యమా: 1984 నుంచి తమిళనాడు ఎన్నికలను గమనిస్తున్న వారు ఈసారి జయలలిత అధికారం నుంచి దిగిపోవడం ఖాయమనే అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. 1984 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించడం, ప్రతిపక్షానికి అధికారం కట్టబెట్టడం తమిళ తంబీలు ఆనవాయితీగా మార్చుకున్నారు. 2011 ఎన్నికల్లో జయలలిత భారీ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించారు. కాబట్టి ఈసారి వంతు డీఎంకేదే. అయితే, ఈసారి డీఎంకే బలహీనంగా కనిపిస్తుండటం, 92 ఏళ్ల ఆ పార్టీ సీఎం అభ్యర్థి కరుణానిధి అంత ప్రభావవంతంగా లేకపోవడంతో ఈసారి ట్రెండ్ మారవచ్చునని అంటున్నారు. జయలలిత రెండోసారి సీఎం అయ్యే అవకాశముందనే అంచనాలు కూడా వెలువడ్డాయి.
2) థర్డ్ ఫ్రంట్ గతి ఏమిటి?: తమిళనాడులో తొలిసారి బలమైన మూడో ప్రత్యామ్నాయం పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీడబ్ల్యూఎఫ్) రూపంలో తెరపైకి వచ్చింది. కెప్టెన్ విజయ్‌కాంత్ సీఎం అభ్యర్థిగా, చిన్నచితక పార్టీలతో ఏర్పడిన థర్డ్ ఫ్రంట్ ఈసారి బలమైన ప్రభావం చూపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఏమేరకు గండి కొడుతుందన్న దానిపైనే విజయ్‌కాంత్ పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయి. అయితే, ఈ మూడో ప్రత్యామ్నాయం సంప్రదాయ ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేకు గట్టి పోటీ ఇవ్వలేదనే విశ్లేషణలు చాటుతున్నాయి.
3) ఒంటరి బీజేపీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి ఏ మిత్రపక్ష పార్టీ తోడు నిలువలేదు. అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చునని ఎన్నికల ముందువరకు భావించినప్పటికీ అది నిజం కాలేదు. ఒంటరిగా బరిలోకి దిగన బీజేపీ ఆశలేమీ పెట్టుకోకపోయినప్పటికీ తమ ఓటుశాతం పెరుగొచ్చని ఆశిస్తోంది.