అంతా నేనే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తరఫున అన్ని అసెంబ్లీ స్థానాల్లో తానే పోటీ చేస్తున్నట్లుగా భావించి గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు అధినేత్రి జయలలిత పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక లేఖ రాశారు. ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి జయలలిత ‘మీ కోసమే నేను, మీ వల్లనే నేను’ అనే నినాదాన్ని మరువకుండా పేర్కొంటారు. ఎన్నికల ప్రచారంలో అదే బాణిని కొనసాగించారు. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలు ఉండగా, ఏడు స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించి, 227 స్థానాలు అన్నాడీఎంకేకు ఉంచుకున్నారు. ఆర్కేనగర్ నుంచి జయలలిత నామినేషన్ వేశారు.
కేవలం ఆర్కేనగర్‌లో మాత్రమే కాదు మిగిలిన 233 స్థానాల్లోనూ జయలలిత పోటీ చేస్తున్నట్లుగా భావించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను పార్టీ కార్యకర్తలతో పంచుకోదలిచానని అన్నారు. తమిళనాడులో ఎప్పటికీ తమ కుటుంబ పాలనే కొనసాగాలని భావించే డీఎంకేకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. అలాగే ప్రజాసేవలో నిరంతరం తరించాలని ఆశించే అన్నాడీఎంకేకు పట్టం కట్టాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కుటుంబపాలన పూర్తిగా విరుద్ధమైనదని అన్నారు. ప్రభుత్వం, పాలన, పార్టీ అంతా తమకే ఉండాలని భావించే డీఎంకే వల్ల సుపరిపాలన చిన్నాభిన్నం అవుతుందని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాలనలో వారసత్వాన్ని సమూలంగా నిర్మూలించాలని కార్యకర్తలను కోరారు.
ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ బాధ్యతలను క్షేత్రస్థాయిలో విభజించి అప్పగిస్తున్నానని, ఆయా విధుల్లోని వారు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ఒకరి విధుల్లో ఒకరు తలదూర్చడం ద్వారా పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించరాదని సూచించారు. తమిళనాడు ఎన్నికల చరిత్రలో తొలిసారిగా మొత్తం 234 స్థానాల్లో రెండాకుల గుర్తుపై పోటీ చేస్తున్నామని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఆశీస్సులతో అన్నిస్థానాల్లో గెలుపు సాధించి చరిత్ర సృష్టించాలని కోరారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పడేవరకు విశ్రమించరాదని ఆమె పిలుపునిచ్చారు.