చెన్నై: పిడిగుద్దులు గుద్దుతాడు ... ఎదురుగా వెళ్లాలంటే ఆపార్టీ వర్గాలకు భయం. ఇందుకు కారణం ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటాడో అని కార్యకర్తల ఆందోళన... ఆయనే డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్. అయితే, తిరుమంగళం వేదికగా జరిగిన సభలో చమటలు కక్కుతూ తన కోసం భద్రతా విధుల్లో ఉన్న కార్యకర్త మీద కెప్టెన్ కరుణ చూపించడం అందర్నీ అశ్చర్యచకుతుల్ని చేసింది..
డీఎండీకే అధినేత విజయకాంత్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. అది మీడియా అయినా సరే, అభ్యర్థి అయినా సరే, నాయకుడైనా సరే. అందుకే ఆయనతో వ్యవహరించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటారు. అలాగే, ఆయన పక్కకు గానీ, ఎదురుగా గానీ ద్వితీయ శ్రేణి నాయకులెవ్వరూ వెళ్లరు. గత వారం మీడియాను కొట్టేందుకు చేతులు ఎత్తడమే కాదు... ఆ ప్రతాపాన్ని ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించారు కూడా.
ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి తిరుమంగళంలో జరిగిన ప్రచార సభలో విజయకాంత్ ముక్కోపినే కాదు, మంచోడ్ని కూడా అని చాటుకున్నారు. ప్రచార వేదిక మీదకు విజయకాంత్ రాగానే, ఆయన్ను మదురై జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రజా కూటమి అభ్యర్థులు, ముఖ్య నాయకులు చుట్టుముట్టారు. వారి వలయం నుంచి విజయకాంత్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కార్యకర్తల సమూహంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అలాగే, వేదిక ముందు భాగంలో ఎవ్వరూ విజయకాంత్ వైపుగా దూసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వేదికపై విజయకాంత్ ఆశీనుడు అయ్యారు. ఆయనకు ముందుగా గణేషన్ అనే సెక్యూరిటీ చమటలు కక్కుతూ, తడిసి ముద్దయిన యూనిఫాంతో వేదిక ముందు కూర్చుని తనకు భద్రతగా ఉండడాన్ని విజయకాంత్ గుర్తించారు. దీంతో గాలి ఆడక చమటలు కక్కుతున్న గణేషన్ వైపుగా తన చేతిలో ఉన్న ప్రసంగాల పేపర్‌తో ఉన్న అట్టను తీసుకుని విసరడం మొదలెట్టారు. ఉన్నట్టుండి చల్లగాలి హాయిగా వస్తుండడాన్ని గణేషన్ ఆశ్వాదిస్తూ, ఎక్కడి నుంచి వస్తుందో తలెత్తి చూసి చటుక్కున అక్కడి నుంచి తప్పుకున్నారు.
అయితే, ఇక్కడ గణేషన్ మీద కెప్టెన్ జాలి చూపిస్తే, గణేషన్ ఏమో కెప్టెన్ ఎక్కడ అట్టతో కొడుతారేమో...! అన్న ఆందోళనతో తప్పుకున్నట్టుగా వేదిక ముందున్న వాళ్లు, వేదిక మీదున్న వాళ్లు చమత్కారాలు విసిరే పనిలో పడ్డారటా. చివరకు తన మీద కెప్టెన్ చూపిన జాలికి గణేషన్ తలగోక్కోవడం, దీనిని కెప్టెన్ చిరునవ్వులు చిందించడం విశేషం.