ఇప్పుడు శరత్ కుమార్ వంతు
సాక్షి, చెన్నై : ఇన్నాళ్లు కార్యకర్తల మీద విరుచుకుపడ్డ విజయకాంత్‌ను చూశాం. ఇప్పుడు శరత్ వంతు వచ్చినట్టుంది. వ్యాన్ నుంచి దిగి మరీ అంతు చూస్తా అని బెదిరించడం ఆత్తూరు ఓటర్లను విస్మయంలో పడేసిందట.తన ప్రసంగానికి ఎవరైనా అడ్డు పడినా, ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, తాను చెప్పింది వినకున్నా, చితక్కొట్టే నాయకుడు విజయకాంత్. ఇప్పటి వరకు ఆయన చేతిలో ఎందరో దెబ్బలు తిన్నారు. చివాట్లు ఎదుర్కొన్నారు. ఆయన బెదిరింపుల్ని ప్రత్యక్షంగా ఇన్నాళ్లు ఓటర్లు తిలకించిన సందర్భాలు అనేకం. అదే బాటలో ప్రస్తుతం శరత్ నడిచేందుకు సిద్ధ పడ్డట్టుంది.
అందుకు తగ్గట్టుగా వ్యవహరించి ఆత్తూరు ఓటర్లను ముక్కుమీద వేలు వేసుకునే లా చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ నటుడు శరత్‌కుమార్ ప్రచారం సాగిస్తున్నారు. ఆత్తూరు ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నత్తం విశ్వనాథన్‌కు మద్దతుగా ప్రచార వాహనంలో శరత్ దూసుకొచ్చారు. తిత్తల్ పట్టి వద్ద ఆయన ప్రచార రథం ఆగింది. అక్కడి వేదిక వద్ద ప్రసంగం మొదలెట్టారు. ఈ సమయంలో జనం వైపు నుంచి సాత్తూరు డీఎంకే కోట, ఇక్కడ పాగా వేయలేరంటూ వచ్చిన నినాదం శరత్‌కు కొపాన్ని తెప్పించిందట.
అంతే చటుక్కున వేదిక దిగి వచ్చి మరీ ఎవడ్రా..ఎవడ్రా అంటూ సినీ బానీలో డైలాగులు చెప్పడమే కాకుండా, అంతు చూస్తా...నేనేమిటో చూపించాల్సి ఉంటుందని గర్జించడంతో ఓటర్లు నివ్వెర పోయారట. ఇంతలో మేల్కొన్న మంత్రి నత్తం విశ్వనాథన్ చటుక్కున శరత్‌ను వ్యాన్ వైపుగా లాక్కెళ్లడంతో అక్కడ పరిస్థితి కాస్త కుదుట పడిందట. అయితే, ఇన్నాళ్లు విజయకాంత్ ఒక్కడే కొపంతో గర్జించే నాయకుడిగా అందరి నోట నానుతుంటే, ఇప్పుడు ఆ బాటలో శరత్ సాగి సెటైర్లు ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఇది శరత్‌కు అవసరమా?అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు.