సాక్షి, చెన్నై: తమ సత్తా ఏమిటో ముందే తెలుసుకుందామని రహస్యంగా చేపట్టిన సర్వే డీఎండీకే అధినేత విజయకాంత్‌ను షాక్‌కు గురి చేసింది. ఐదు స్థానాల్లో పట్టు సాధించేందుకు వీలుందన్న ఆ సర్వే సంకేతాలతో కెప్టెన్ మేల్కొన్నారు. తన టార్గెట్, గురి అంతా ఆ స్థానాల మీదే పెట్టారు. మరింతగా కష్ట పడాలంటూ పార్టీ శ్రేణులను హెచ్చరించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో ప్రతి పక్ష నేతగా అవతరించిన డీఎండీకే అధినేత విజయకాంత్ తాజా, లోక్ సభ ఎన్నికలతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ఉన్నారు. డీఎంకే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, కాంగ్రెస్ మరెన్ని హామీలు గుప్పించినా, వాటిని పక్కన పెట్టి ఎన్డీఏతో జతకట్టేశారు. రాష్ట్రంలో బీజేపీ నీడన చేరినా పర్వాలేదు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆశతో విజయకాంత్ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఆ కూటమిలో అత్యధికంగా 14 స్థానాల బరిలో తాము ఉండడంతో వాటిలో సగానికి పైగా గెలుపు సాధించాలన్న వ్యూహంతో ఉన్నారు.
విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలు చేపట్టిన ప్రచారాలకు అనూహ్య స్పందన రావడంతో డీఎండీకే వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. అదే సమయంలో ఈ ఎన్నికల ద్వారా తన సత్తా ఏమిటో జాతీయ స్థాయిలో చాటడం లక్ష్యంగా ఉన్న విజయకాంత్, ముందుగా తన బలాన్ని తేల్చుకునే పనిలో పడ్డట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వే: తాము పోటీ చేస్తున్న సెంట్రల్ చెన్నై, తిరువళ్లూరు, ఉత్తర చెన్నై, సేలం, తిరుచ్చి, తిరునల్వేలి, విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరుప్పూర్, దిండుగల్, నామక్కల్, మదురై, కరూర్‌లలో తమ సత్తాను ముందే గ్రహించేందుకు సర్వేకు విజయకాంత్ నిర్ణయించారట!. చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు, ఓ స్వచ్ఛంద సంస్థ, కెప్టెన్ టీవీ సంయుక్తంగా కలసి ఆ 14 నియోజకవర్గాల్లో గత వారం రోజులుగా సర్వే నిర్వహించి ఉన్నాయి. అన్ని కోణాల్లో ఈ సర్వే సాగినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నారుు. అసెంబ్లీ స్థానాల్లో తమకు ఇది వరకు ఉన్న బలం, ప్రస్తుత బలం, ఓట్లు చీలిన పక్షంలో లాభం ఎవరికి అన్న దిశగా
సాగిన ఈ సర్వే నివేదిక కెప్టెన్‌కు షాక్ ఇచ్చిందటా..!
ఆ సర్వే నివేదికను పరిశీలించిన విజయకాంత్‌కు పెద్ద షాకే తగిలినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 14 స్థానాల్లో ఐదు స్థానాల్లో మాత్రమే బలం పెరిగినట్టు తేలింది. ఈ స్థానాల్లో మరింతగా కష్ట పడిన పక్షంలో విజయం వరించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు రావడంతో తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో విజయకాంత్ పడ్డారు. మిగిలిన తొమ్మిది స్థానాల్లో పార్టీ శ్రేణుల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్టు, కొందరు అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం ఎదురు చూస్తున్నట్టు తేలింది. ఆరు స్థానాల్లో అయితే, ప్రచారం ఆశాజనకంగా లేనట్టు, అక్కడి నేతలు ఏదో మొక్కుబడిగా ముందుకెళుతున్నట్టు తేలడంతో కంగుతిన్న విజయకాంత్ అక్కడి నాయకుల్లో ఉత్సాహం నింపడంతోపాటుగా హెచ్చరికలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
ఫోన్లతో పిలుపు : ప్రధానంగా ఐదు స్థానాలు తమ గుప్పెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా, పూర్తి స్థాయిలో ఆ స్థానాల మీదే దృష్టి కేంద్రీకరించేందుకు సిద్ధం అయ్యారు. అక్కడి నాయకులకు స్వయంగా విజయకాంత్ ఫోన్లు చేసి మరీ ఎన్నికల్లో శ్రమించాలని, ఎన్నికలయ్యాక, అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని సూచిస్తున్నారు. మిగిలిన చోట్ల ఓటు బ్యాంక్ దక్కించుకోవడం లక్ష్యంగా అక్కడి నాయకులను ఉరుకులు పరుగులు తీయించేందుకు సిద్ధం అయ్యారు. కొందరిని హెచ్చరికల ద్వారా, మరి కొందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు బ్యాంక్‌తో సత్తా చాటుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఐదు స్థానాల్లో గెలుపు, మిగిలిన స్థానాల్లో ఓటు బ్యాంకు పెరిగితే చాలన్న ఆశతో ఉన్న విజయకాంత్‌కు పార్టీ శ్రేణుల నుంచి సహకారం అంతంత మాత్రమే. దీంతో ఆయా స్థానాల్లో ఓటమి చవి చూసినా, ఓటు బ్యాంక్ తగ్గినా చర్యలు తప్పదంటూ విజయకాంత్ హెచ్చరిస్తున్నారు. అయితే, ఆయా స్థానాల్లో నాయకులు ఈ హెచ్చరికలకు భయపడే స్థితిలో లేనట్టు సమాచారం. అవసరం అయితే, చివరి క్షణంలో జంప్ జిలానికీ సిద్ధం అన్న సమాధానాల్ని కొందరు నేతలు ఇస్తుండడం గమనించాల్సిందే.
కెప్టెన్‌కు షాక్
Published Sun, Apr 20 2014 11:53 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement