అధికారం మాదే !
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కూటమి పాలన తథ్యం అని, తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. కూటమిలోని ఆరుగురు నేతలు ఆదివారం ఒకే వేదిక మీదకు వచ్చారు. తమ కూటమి సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును అధికార పూర్వకంగా ప్రకటించారు. కాంచీపురం జిల్లా మామండూరు వేదికగా ఆ కూటమి వర్గాలు హోరెత్తాయి. డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి నేతృత్వంలో కాంచీపురం జిల్లా మామండూరు వేదికగా భారీ మహానాడుకు పిలుపు నిచ్చారు.
ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ కూటమి నాయకులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షం అవుతూ రాగా, ప్రస్తుతం తొలి సారిగా డీఎండీకే అధినేత విజయకాంత్ వేదిక ఎక్కారు. ఈ కూటమిలోకి తమిళ మానిల కాంగ్రెస్ సైతం చేరడంతో ఆ పార్టీ నేత జి కే వాసన్ సైతం వేదిక మీద ప్రత్యక్షం అయ్యారు. సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, డీఎండీకే నేత విజయకాంత్, తమాకా నేత వాసన్ ఒకే వేదికగా తమ ఎన్నికల శంఖారావం పూరించారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను అధికార పూర్వకంగా తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
రాష్ట్రంలో కూటమి పాలన తథ్యం అని, తామే అధికార పగ్గాలు చేపట్టనున్నామని, విజయకాంత్ సీఎం ఖావడం తథ్యం అంటూ ఈసందర్భంగా నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రేమలత తన ప్రసంగంలో డీఎండీకే నుంచి బయటకు వెళ్లిన వారిని ఉద్దేశించి తీవ్రంగా విరుచుకు పడ్డారు. తానే కెప్టెన్ కంట్రోల్‌లో ఉంటే, ఇక, డీఎండీకే తన కంట్రోల్‌లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వదిన వదిన అంటూ తన పేరుకు కళంకం తీసుకొస్తే ఉపేక్షించనని మండి పడ్డారు. ఆ కూటమి కన్వీనర్ వైగో ప్రసంగిస్తూ , ఇక నేతలందరూ తలా ఓ వైపుగా రాష్ట్రం ఆరు దిశల్లో పర్యటించనున్నామని, డీఎంకే, అన్నాడీఎంకేలకు పతనం లక్ష్యంగా, కూటమి పాలన అధికార పగ్గాలు చేపట్టడం థ్యేయంగా ఇక తమ పయనం ఉంటుందని ప్రకటించారు.
డిఎంకే, అన్నాడిఎంకేలు అవినీతి ఊబిలో కూరుకున్నారని, వీళ్లంతా ఆ కేసుల్లో జైలుకు వెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు. అన్నాడిఎంకేకు అనుకూలంగా ఎన్నికల యంత్రాంగం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. డిఎంకే, అన్నాడీఎంకేలు నోట్లతో ఓట్లను రాబట్టే వ్యూహంతో ఉన్నారని, ఆయా ప్రాంతాల్లోని ఆరు పార్టీల నాయకులు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి ఆ రెండు పార్టీల నగదు బట్వాడాను అడ్డుకుందామని పిలుపునిచ్చారు.
అవినీతి ఆస్తులు జప్తు
తాము అధికారంలోకి రాగానే, లోకాయుక్త అమలు తక్షణ నిర్ణయంగా వైగో ప్రకటించారు. ఆ చట్టం అమలుతో అవినీతితో సంపాదించిన డిఎంకే, అన్నాడీఎంకే వర్గాల ఆస్తులన్నింటినీ జప్తు చేస్తామన్నారు. డిఎంకే, అన్నాడీఎంకేలు దోపిడీల్లో దొందు దొందే అని, మద్యం రాష్ట్రంలో ఏరులై పారేందుకు ఈ ఇద్దరే కారణం అని శివాలెత్తారు. డిఎంకే అధికారంలోకి వస్తే, అన్నాడీఎంకే వర్గాల కంపెనీల నుంచి, అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే డిఎంకే కుటుంబానికి చెందిన మద్యం కంపెనీల నుంచి సరకు కొనుగోలు చేయడం జరుగుతున్నదని, దీన్ని బట్టి చూస్తే, ఈ ఇద్దరు కంబైన్డ్ డెకాయిట్స్ అంటూ వ్యాఖ్యానించారు.