పొత్తులపై కెప్టెన్ రూటు ఎటు?
చెన్నై: కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన తమిళ పార్టీ డీఎండీకే శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని అధినేతకు అప్పగిస్తూ తీర్మానించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత జయలలిత విజయానికి సహకరించిన విజయ్‌కాంత్ ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో జత కట్టారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో రాజకీయంగా అందరి దృష్టి ఆయనపైనే ఉంది.
దేసియ ముర్పోకు ద్రవిడ కజగం (డీఎండీకే) ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామియేనని బీజేపీ భావిస్తుండగా విజయ్‌కాంత్ మాత్రం ఎవరితో జత కట్టాలనే విషయమై ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయితే తన డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చే పార్టీలతోనే ఆయన పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఏ కూటమితోనైనా చేతులు కలుపుతానని ఆయన స్పష్టం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
డీఎండీకే ఇప్పుడు తమిళనాడులో నెంబర్-2 స్థానంలో ఉంది. దీంతో ఇప్పటికే తమతో కలిసిరావాలని డీఎంకే సుప్రీం కరుణానిధి విజయ్‌కాంత్‌కు ఆహ్వానం పంపారు. అలాగే వామపక్షాలు, వైకో ఎండీఎంకే పార్టీలతో కొత్తగా ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) కూడా విజయ్‌కాంత్‌తో పొత్తుకు తహతహలాడుతోంది. విజయ్‌కాంత్ మాత్రం ఎప్పటిలాగే కింగ్ మేకర్‌లాగా ఉండేందుకు సిద్ధపడటం లేదు. మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పీఠాన్నే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇటీవల పీడబ్ల్యూఎఫ్ నేతలతో జరిగిన చర్చల్లో ఇదే విషయాన్ని కెప్టెన్ స్పష్టం చేసినట్టు సమాచారం. విజయ్‌కాంత్‌కు బలమైన ఓటుబ్యాంకు ఉంది. 2006 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన విజయ్‌కాంత్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే 10శాతం ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనతో జతకట్టే ఏ కూటమి అయినా ఎక్కువ స్థానాలు గెలుపొందే అవకాశముంది. అదేవిధంగా విజయ్‌కాంత్ ఒంటరిగా పోటీచేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెప్తున్నారు. దీంతో ఏ కూటమి వైపు విజయ్‌కాంత్ మొగ్గుచూపుతారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.