చాగలమర్రిలో కానిస్టేబుల్ వీరంగం
- ఏటీఎం వద్ద ఖాతారుడిపై వీరంగం
- చెయ్యి విరిగి ఆసుపత్రి పాలు
- హెడ్‌కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపిన అధికారులు
చాగలమర్రి: ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూలో ఉన్న ఓ ఖాతాదారుడిపై హెడ్‌కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌బీఐ వద్ద బుధవారం ఉదయం 9 గంటలకే జనం బారులుదీరారు. ఒక్కొక్కరు రెండు, మూడు కార్డులతో వచ్చి డబ్బులు డ్రా చేస్తుండటంతో క్యూ ముందుకు కదలక అప్పటికే ఖాతాదారులు విసిగిపోయారు. 11.30 గంటల సమయంలో హెడ్‌కానిస్టేబుల్ రాజాహుసేన్ క్యూను కాదని వెళ్లి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోతూ ఒక కార్డుతోనే విత్‌డ్రా చేయించాలని బందోబస్తుగా ఉన్న కానిస్టేబుల్‌ను ఆదేశించాడు. అయితే .. ఎస్‌ఐ సార్ రెండు కార్డులతో తీసుకోమని, చెప్పారని.. ఇప్పుడు మీరు వచ్చి ఒక సారి మాత్రమే డబ్బులు తీసుకోవాలని చెబితే ఎలా అంటూ క్యూలో ఉన్న ఖాతాదారుడు సుధాకర్ ప్రశ్నించారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఆ యువకుడితో వాగ్వాదానికి దిగాడు. మాటామాట పెరిగి యువకుడిపై దాడి చేయడంతో చెయ్యి విరిగింది. పక్కన ఉన్న వారందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో హెడ్‌కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయపడిన యువకుడిని కేరళా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని విచారించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.