కర్ణాటక, మైసూరు: కరోనా వైరస్ కొందరు విద్యార్థులకు పరీక్షల జంఝాటాన్ని తప్పించింది. పాత మైసూరు ప్రాంతంలోని సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పాస్ చేయాలని నిర్ధారించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర బోర్డు, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు ఈ నెల 20 లోగా పరీక్షలు పూర్తి చేసి పై తరగతులకు పంపించాలని తీర్మానించారు. అలాగే ఇక పదో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో మార్చి 22 లోగా పరీక్షలు నిర్వహించి విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని, అవసరమైతే పరీక్షలు లేకుండానే పాఠశాలలు మూసివేయాలని నిర్ధారించారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయినా పాస్ చేయాలని నిర్ణయించారు.
పాఠశాలల్లో పరిశుభ్రతపై చర్చ
విద్యార్థులకు ఎవరికైనా హఠాత్తుగా దగ్గు, జలుబు, జ్వరం కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించాలని తీర్మానించారు. ఇటీవల కరోనా భయాందోళనల గురించి సమావేశంలో చర్చించారు. కరోనా బారి నుంచి తమ విద్యార్థులను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి విద్యార్థి తొలుత పాఠశాలకు రాగానే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కునేలా చేయాలని, మాస్కులను ఇవ్వాలని, వేడి తాగునీరు అందివ్వాలని, అలాగే పాఠశాల ఆవరణం శుభ్రంగా ఉండాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment