కరణ్ చిత్రానికి కోర్టు బ్రేక్
చెన్నై: నటుడు కరణ్ చిత్రానికి మద్రాసు హైకోర్టు బ్రేక్ వేసింది. విలన్‌గా, హీరోగా పలు చిత్రాల్లో నటించిన కరణ్ కొంచెం గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం కన్నియుమ్ కళైయుమ్ సెమకాదల్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లో కెళితే...చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ గగన్ బోద్రా మద్రాసు హైకోర్టులో కన్నియుమ్ కాళైయుమ్ సెమకాదల్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ పిటిషన్ వేశారు. అందులో ఆయన కన్నియుమ్ కాళైయుమ్ సెమకాదల్ చిత్ర నెగటివ్, శాటిలైట్ హక్కులు, విదేశీ విడుదల హక్కులను చిత్ర దర్శక నిర్మాత వి.సి.వడావుడైయన్‌నుంచి తాను పొందినట్లు పేర్కొన్నారు.
అందుకు గాను నిర్మాతకు రూ.40 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే ఇప్పుడాయన ఈ హక్కులను మరొకరికి విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తానీ విషయంలో నిర్మాతతో చర్చించ యత్నించినా నిర్మాత నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. అందువలన కన్నియుమ్ కాళైయుమ్ సెమకాదల్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును మంగళవారం విచారించిన న్యాయమూర్తి ఎం.దురైస్వామి చిత్ర విడుదలపై తాత్కాలిక స్టే విధిస్తూ నిర్మాత వడివుడైయాన్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.