నయనతార–విఘ్నేష్‌కి నోటీసు జారీ చేసిన హైకోర్టు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్‌ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు.
అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్‌ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే.
– సాక్షి, తమిళ సినిమా
Comments
Please login to add a commentAdd a comment